వధువును చూయించండి మహాప్రభో.. పెళ్లికాని ప్రసాదుల ఆవేదన.. వినూత్న నిరసన
Unmarried men hold protest in Maharashtra.పెళ్లికాని యువకుల సంఖ్య పెరిగిపోతుంది
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2022 10:12 AM ISTఇటీవల కాలంలో పెళ్లికాని యువకుల సంఖ్య పెరిగిపోతుంది. ఉన్నత చదువులు చదివి మంచిగా సంపాదిస్తున్నప్పటికీ వివాహాలు కావడం లేదు. ఎంత ప్రయత్నించినప్పటికి వధువు మాత్రం దొరకడం లేదు. దాదాపుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో అయితే పరిస్థితి చాలా దారుణం. దీంతో అక్కడి యువకులు వింత నిరసనలు చేపట్టారు. పెళ్లి కొడుకు గెటప్‌లో గుర్రాలపై కలెక్టర్ కార్యాలయానికి ఊరేగింపుగా వచ్చి తమ నిరసనను తెలియజేశారు.
క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో ఈ వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ బైఠాయించారు. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిల కొరత ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రాంతి జ్యోతి పరిషత్ అధ్యక్షుడు రమేష్ భాస్కర్ మాట్లాడుతూ .. మహారాష్ట్రలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా షోలాపూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.
రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, దీని అంతటికి లింగ నిర్థారణ చట్టం పటిష్టంగా అమలు కాకపోవడమేనని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వం, అధికారులు లింగ నిర్థారణ చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 25 నుంచి 40 ఏళ్ల లోపు పురుషులు చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ వివాహాలు కావడం లేదన్నారు. జిల్లా అధికారులు స్పందించి వధువులను చూసి పెట్టాలని డిమాండ్ చేశారు.