సోదరి ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. ఊహించని ట్విస్ట్
Two Girls marriage each other in Rajasthan.ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య పడుతుందో ఎందుకు పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు.
By తోట వంశీ కుమార్ Published on 14 Jan 2022 8:59 AM ISTప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు. ప్రేమకు వయస్సు, మతం, కులం, లింగబేదాలు వంటివి అడ్డురావని చెబుతుంటారు. తాజాగా ఇద్దరు యువతుల మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. ఒకరి విడిచి ఒకరు ఉండలేకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి ఏకంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని రతన్‌గఢ్‌లో ఉంటున్న తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. ఈ క్రమంలో సోదరి ఆడపడుచు (18)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిని కలుసుకోకుండా చేశారు. అయినప్పటికీ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ తగ్గకపోగా.. మరింతగా పెరిగింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.
ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో రతన్‌గడ్‌కు చెందిన యువతి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. హరియాణాలోని అదంపుర్ మండీకి చేరుకుని తన ప్రియురాలిని కలుసుకుంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఫతేబాద్ వెళ్లారు. అక్కడ పెళ్లి చేసుకున్నారు. గత రెండు నెలలుగా వారు జింద్‌లో కలిసి నివసిస్తున్నారు. తన కుమారై కనిపించడం లేదని రతన్‌గడ్‌కు చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతులిద్దరినీ గుర్తించి ఈ నెల 12న తీసుకువచ్చారు. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని యువతుల తల్లిదండ్రులు, పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ఇందుకు వారు ససేమీరా అన్నారు. తాము కలిసే ఉంటామని తెగేసి చెప్పారు. దీంతో చేసేది ఏమీ లేక పోలీసులు వారిని పంపించి వేశారు.