కరోనా దెబ్బకు చాలా రంగాలు అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో చాలా దేశాలు ఆంక్షల పేరుతో అంతర్జాతీయ సరిహద్దులు మూసివేశాయి. ఇక విదేశాలకు వెళ్లడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక వరల్డ్ టూర్(ప్రపంచ పర్యటన) అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ కలగా మారిపోయిందని చెప్పవచ్చు. చాలా మంది విదేశాల్లో పర్యటించడానికి ఇష్టపడడం లేదు. దీంతో పర్యాటక రంగ సంస్థలు వ్యాక్సిన్ టూరిజంకు తెరతీశాయి. అంటే.. విహార యాత్రలకు వెళ్లి అక్కడ కరోనా టీకాలు వేయిస్తాయట.
దేశంలో ఇప్పట్లో కరోనా టీకా దొరకడం కష్టమని భావిస్తున్నారా.. రష్యా పర్యటనకు మా ప్యాకేజీని ఎంచుకోండి. అక్కడ స్పుత్నిక్-వీ టీకా రెండు డోసులు వేయిస్తాం.. దుబాయ్ కేంద్రంగా పని చేస్తోన్న ఢిల్లీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటన ఇది. కరోనా టీకాల కొరత నేపథ్యంలో ప్రకటించిన ఈ ప్యాకేజీలో 24 రోజుల రష్యా పర్యటన, 2 స్పుత్నిక్ వీ డోసులు ఉన్నాయి. రెండు డోసుల మధ్య వ్యవధి 21 రోజులు. అందుకే పర్యటన ప్యాకేజీని 24 రోజులకు రూపొందించారు. ఇక రెండో డోసు మధ్య వ్యవధిలో పర్యాటకులను సైట్ సీయింగ్‌కు తీసుకెళ్లనుంది.
ఈ ట్రిప్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.29 లక్షలు. ఇందులో స్పుత్నిక్ వి టీకా ధర, విమాన టికెట్లు, ఖర్చులు, రష్యాలోని పర్యాటక స్థలాలల ప్రవేశ రుసుములు అన్నీ కలిసి ఉన్నట్లు ఆ సంస్థ చెబుతోంది.కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌కు కొరత ఉండడంతో ఈ ఆఫర్‌కు డిమాండ్ కూడా భారీగానే వస్తోందట. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు పూర్తిగా నిండిపోయినట్లు ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. తొలి బ్యాచ్ మే 29న, రెండో బ్యాచ్ జూన్ 7న, మూడో బ్యాచ్ జూన్ 15న మాస్కో బయలేర్దనుందనిచెప్పింది. కాగా.. రష్యాలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై ఎటువంటి ఆంక్షలు లేవు.