ఇటీవల కాలంలో దగ్గరి బంధువులు చనిపోయినప్పటికీ కూడా వారి అంత్యక్రియలకు వెళ్లని వారు చాలా మందే ఉన్నారు. కారణం ఏదైనప్పటికీ కూడా వెళ్లడం లేదు. అలాంటిది ఓ యాచకుడు చనిపోయే ఎవరైనా పట్టించుకుంటారా..? ఆ యాచకుడి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అయితే.. ఓ యాచకుడి అంత్యక్రియల్లో వేల సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. బసవ అలియాస్ హుచ్చా బాస్వా(45) హడగలి పట్టణంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత 20 ఏళ్లుగా అక్కడే యాచిస్తూ జీవనం సాగిస్తుండడంతో అతడు అక్కడి వారికి సుపరితుడు. అయితే.. అతడు అందరిలా కాదు.. ఎంత నగదు ఇచ్చినా కూడా.. కేవలం రూపాయి మాత్రమే తీసుకుని మిగతాది వారికే ఇచ్చేవాడు. అతడికి భిక్షం పెడితే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకనే అతడిని పిలిచి మరీ భోజనం పెడుతుండేవారు. అలా అందరితో కలివిడిగా ఉండేవాడు. శనివారం అతడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఆదివారం నిర్వహించిన అతడి అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఓ సెలబ్రెటీ చనిపోతే ఎంత మంది వస్తారో అంత మంది వచ్చారు. బస్యా అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.