మాజీ ప్రియుడిపై పగసాధిద్దామనుకుంటే.. బెడిసి కొట్టింది
The master plan to take revenge on the ex-boyfriend.ప్రేమలో ఉన్నప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. ఏదో కొత్త లోకంలో
By తోట వంశీ కుమార్ Published on 10 July 2021 9:27 AM ISTప్రేమలో ఉన్నప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. ఏదో కొత్త లోకంలో విహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రేయసిగానీ, ప్రియుడు గానీ ఏం చేసినా కూడా ఏదో తెలియని అనుభూమి కలుగుతుంది. ఇక ప్రేమికులు విడిపోవడానికి అనేక కారణాలుంటాయి. ఇక విడిపోయినప్పుడు.. అంత వరకు ఉన్న ప్రేమ.. కోపంగా, ద్వేషంగా మారే అవకాశం ఉంది. కాగా.. ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారు. ఇక తనను కాదని ప్రియుడు మరో అమ్మాయిని ప్రేమించడాన్ని ఆ యువతి జీర్ణించుకోలేకపోయింది. తన ప్రియుడికి బుద్ది చెప్పాలని బావించింది. అందుకోసం ఓ సరికొత్త వ్యూహాం రచించింది.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని షావోజింగ్ ప్రాంతానికి చెందిన లావ్ అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. కొంత కాలం బాగానే ఉన్న తరువాత వారి మధ్య అభిప్రాయబేదాలు రావడంతో విడిపోయారు. ఆమె ప్రియుడు మరో యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని లావ్ జీర్ణించుకోలేకపోయింది. తన ప్రియుడికి బుద్దిచెప్పాలని నిర్ణయించుకుంది. అందుకు ఓ మాస్టర్ ప్లాన్‌ను సిద్దం చేసింది. ఓ స్నేహితుడి సాయంతో ప్రియుడి కారును అద్దెకు తీసుకుంది. రెండు రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తూ రోడ్లపై ఇష్టారీతిన తిరిగింది. 49 సార్లు రెడ్ లైట్ ఉన్నప్పుడు కారును పోనివ్వడంతో పాటు ఓ సారి ఓవర్‌స్పీడుగా నడిపింది. మొత్తం రెండు రోజుల్లోనే 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించింది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించడంతో.. పెద్ద మొత్తంలో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారని.. ఆ కారు ఆమె ప్రియుడిది కాబట్టి అతడు పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సదరు యువతి బావించింది. అయితే.. ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. కేవలం రెండు రోజుల్లో 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు.. కారు నడుపుతున్న ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిసింది. తన ప్రియుడిపై పగ తీర్చుకోవడం కోసం సాయం చేయాలని లావ్ కోరిందని.. అందుకనే కారును అద్దెకు తీసుకుని ఇలా చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు లావ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారుపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను రద్దు చేశారు. కారును ఆమె ప్రియుడికి ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చెడపకురా చెడేవు అని ఉరకే అనలేదు అని ఒకరు కామెంట్ చేయగా.. పాపం ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది అంటూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.