ఆ ఊరిలో సైరన్ మోగగానే.. సెల్‌ఫోన్లు, టీవీలు స్విచ్చాఫ్.. ఎందుకంటే..?
The innovation decision of the Vadgaon village Sarpanch.గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 7 గంటల నుంచి
By తోట వంశీ కుమార్ Published on 8 Oct 2022 10:02 AM ISTఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి మనిషి జీవితంలో భాగమైపోయాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేకుండా ఒక రోజు గడవలేని పరిస్థితి వచ్చింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లు, గాడ్జెట్లతోనే గడిపేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం లేదు, మహిళలు ఇంటి పనులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 7 గంటల నుంచి గంటన్నర పాటు ప్రజలంతా స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కడేగావ్ మండలం మోహిత్యాంచె వడ్గావ్ గ్రామంలో ఆగస్టు 15 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. ఆ గ్రామ జనాభా 3,105. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు వినడానికి తల్లిదండ్రులు గ్రామంలోని విద్యార్థుల కోసం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేశారు. దీంతో పిల్లలు చదువును నిర్లక్ష్యం చేసి గంటల తరబడి ఆ ఫోన్లలోనే గడపడం ప్రారంభించారు. ఇక ఇంట్లో మహిళలు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు.
ఇదంతా గమనించిన గ్రామ సర్పంచ్ విజయ్ మోహిత్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15న గ్రామంలోని మహిళలతో నిర్వహించిన సమావేశంలో ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8.30 గంటల మధ్య టీవీలు, సెల్‌ఫోన్లు ఆఫ్ చేయాలని నిర్ణయించారు.
మరి ఇంట్లో జనం ఫోన్లు, టీవీలకు దూరంగా ఉన్నారని తెలుసుకోవడం ఎలా..
ఈ బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. రాత్రి 7 గంటలకు సైరన్ మోగగానే ఫోన్లు, టీవీలు పక్కనపెట్టి ప్రజలు తమ పని తాము చేసుకుంటారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ క్రమంగా అలవాటు పడ్డారు.