పిల్లలు అల్లరి చేస్తుంటే ఉపాధ్యాయులు వారిని మందలించడం చేస్తుంటారు. మరీ మాట వినని సందర్భంలో ఒక్కొసారి కొడుతుంటారు. ఇదంతా పిల్లలను క్రమశిక్షణలో ఉంచేందుకే గురువులు చేస్తుంటారు. అయితే.. ఇటీవల కాలంలో విద్యార్థుల ఆలోచనా దోరణిలో మార్పు వస్తోంది. సినిమాల ప్రభావమో ఏమో తెలీదు కానీ.. ఇటీవల కొందరు చిన్నారులు టీచర్ తనను కొడుతున్నారని.. వారిపై కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. అకారణంగా తనను టీచర్లు కొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అనిల్ అనే ఏడేళ్ల విద్యార్థి రెండో తరగతి చదువుతన్నాడు. అయితే.. తనను ఏ కారణం లేకుండానే సన్నీ, వెంకట్ అనే ఇద్దరు టీచర్లు కొట్టారంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్ఐ రమాదేవికి ఫిర్యాదు చేశాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే కొందరు పెద్దలే భయపడుతుంటారు. అలాంటిది ఓ బాలుడు ధైర్యంగా రావడంతో ఆ బాలుడి ధైర్యానికి పోలీసులు మెచ్చుకున్నారు. బాలుడి ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. కాగా.. బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.