మనుషులు కాకుండా జంతువుల్లో పాములు పగబట్టడం గురించి మనం విన్నాం. అయితే.. ఎక్కడైనా కాకి పగబట్టడం గురించి విన్నారా..? కానీ ఓ ఏడుగురు మాత్రం.. తమపై కాకి పగబట్టిందని అంటున్నారు. వారు ఇంటి నుంచి బయటకు వచ్చిందే ఆలస్యం ముక్కుతో, కాళ్లతో పొడవడం, రక్కడం వంటివి చేస్తోందట. వారు ఎంత మందిలో ఉన్నా సరే సరిగ్గా వారిపైనే వాలి.. మరీ రక్కుతోందని కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం ప్రజలు వాపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో కొన్ని రోజులుగా ఓ కాకి సంచరిస్తోంది. గ్రామంలో అందరిపై కాకుండా ఓ ఏడుగురిపైనే దాడి చేస్తోంది. వారు వీధిలోకి వచ్చిన వెంటనే వారి తలపై కాళ్లతో దాడి చేసి గాయపరుస్తోంది. వారు గుంపులో ఉన్నా సరే ఎగిరొచ్చి వారిపైనే దాడిచేస్తోంది. తొలుత పరుశురామప్ప అనే వ్యక్తిని గోళ్లతో రక్కింది. ఇలా..కొందరిపై కాకి పగబట్టి దాడిచేస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామం నుంచి కాకిని తరిమేందుకు ఎంతప్రయత్నించినా.. అది మాత్రం వెళ్లడం లేదని స్థానికులు అంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' చిత్రంలో లాగా.. ఆ కాకి కూడా గత జన్మలో జరిగిన ఘటనలు గుర్తుకువచ్చాయోమోనని అంటున్నారు.