ఫలానా వయసులోనే పెళ్లి చేసుకోవాలనే చట్టం ఇప్పటి వరకు ఏ దేశంలోనూ లేదు. అయితే.. కొన్ని దేశాల్లో మేజర్(ఆయా ఆయా దేశాల చట్టాల్లో నిర్ణయించిన వయసు) తరువాత.. ఆ యువతీ, యువతకుల ఇష్టం ఆధారంగా పెళ్లి చేసుకోవచ్చు. లేదా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా నివసించే హక్కు ఉంది. కొందరు లేటుగా పెళ్లి చేసుకుంటారు. అయితే.. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే చట్టం ఇప్పటి వరకు లేదు. కానీ త్వరలో 18 ఏళ్లు దాటిన వారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనన్న ఓ చట్టం రాబోతుంది. అయితే.. భయపడకండి అది మన దగ్గర కాదులెండి. మన పొరుగుదేశం పాకిస్థాన్‌లో.
పాకిస్థాన్ దేశంలోని సింధు రాష్ట్ర అసెంబ్లీలో 18 ఏళ్లు దాటిన వారందరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటూ ఓ విన్నూత బిల్లును ఓ చట్ట సభ్యుడు బుధవారం ప్రవేశ పెట్టాడు. ఈ మేరకు ముసాయిదా ను అసెంబ్లీలో సమర్పించాడు. మత్తాహిదా మజ్లిస్-ఏ-అమల్ (ఎమ్ఎమ్ఏ) పార్టీకి చెందిన నేత సయ్యద్ అబ్దుల్ రషీద్.. ద సింధ్ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్-2021 బిల్లు ముసాయిదాను సింధ్ అసెంబ్లీ సెక్రటేరియట్ కు అందజేశారు. 18 ఏళ్లు దాటిన వారికి పెళ్లి చేయని తల్లిదండ్రులు అందుకు తగిన కారణాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎదుట తెలియజేయాల్సి ఉందుందని ఆ ముసాయిదాలో పేర్కొన్నారు. అలా చేయని వారికి రూ.500 ను జరిమానా విధించాలని తెలిపారు.
ఈ బిల్లు ముసాయిదాను సమర్పించిన అనంతరం అబ్దుల్ రషీద్ ఓ వీడియో ప్రకటనను విడుదల చేశాడు. 'సామాజిక రుగ్మతలు, పిల్లలపై అత్యాచారాలు, అనైతిక కార్యకలాపాలు, నేరాలు వంటివి దేశంలో పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి ముస్లిం యువతీ, యువకులు 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునే హక్కును కల్పిస్తున్నాం. వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. సింధ్ రాష్ట్ర యువత పురోగతి చెందుతుందని' చెప్పారు. ఇందుకోసం అసెంబ్లీ సభ్యులంతా మద్దతు తెలపాలని కోరారు. చూడాలీ మరి ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుందో లేదో.