బుల్లెట్ బండి.. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! పెళ్లిళ్లలోనూ, పలు కార్యక్రమాల్లోనూ ఈ పాటను తెగ వాడేస్తూ ఉన్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ పాటకు స్టెప్స్ వేశారు. తాజాగా ఈ పాటను ఆసుపత్రుల్లో కూడా పెడుతున్నారు. రోగుల్లో మనో ధైర్యం నింపడానికి డాక్టర్లు, నర్సులు ఈ పాటకు డాన్స్ లు చేస్తూ ఉత్సాహ పరుస్తూ ఉన్నారు.
హాస్పిటల్ లో పక్షవాతంతో మంచంపట్టిన ఓ వ్యక్తి త్వరగా కోలుకునేందుకు ఒక నర్సు వినూత్న ఆలోచన చేసింది. బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించేలా ప్రేరేపించింది. అతడికి పక్కనే ఉన్న నర్స్ సహాయం చేస్తూ ప్రొత్సహిస్తోంది. ఒక పాట ఓ రోగి మెదడును ఉల్లాసపరుస్తూ, దేహకదలికలపై కంట్రోల్ తీసుకొస్తూ, ఓ ఫిజియోథెరపీగా ఉపయోగపడుతుందని కొందరు కామెంట్‌లు చేశారు. నర్స్ పనితనానికి మరికొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. డుగ్గు డుగ్గు డుగ్గని' అంటూ పెళ్లి కూతురు వరుడు ముందు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌లా మారింది. తెలంగాణలో మొదలైన ఈ క్రేజ్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ''నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. డుగ్గు డుగ్గు డుగ్గని'' అనే పాటే మార్మోగుతోంది. అందుకు తగ్గట్టుగా వీడియోలను కూడా చేస్తూ వస్తున్నారు.