ఇటీవల చిన్నచిన్న కారణాలతో పెళ్లి పీటలపైకి వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. వరుడు ఆలస్యంగా వచ్చాడనో, పెళ్లి కొడుకు నచ్చలేదనో, వరుడికి చదువు రాదనో వంటి కారణాలతో ఆగిన పెళ్లిళ్లను మనం చూశాం. తాజాగా మటన్ కారణంగా ఓ పెళ్లి ఆగిపోయింది. వినడానికి కొంచెంద విడ్డూరంగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తోడుపెళ్లి కొడుకు, ఇతర బంధువులు హాజరయ్యారు. అయితే.. విందులో మటన్ కర్రీ కావాలని వరుడు తరుపు వారు అడిగారు. అయితే.. మేక మాంసం లేదని వధువు తరుపు వారు చెప్పారు. వరుడి తరుపు వారు ఆగ్రహానికి గురైయ్యారు. దీంతో ఇరువురి మధ్య చిన్నగా మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారింది. చివరికి పెళ్లి రద్దుచేసుకునే దాకా వెళ్లింది.
వరుడు పెళ్లిని రద్దు చేసుకుని తన బంధువులతో కలిసి అక్కడి నుంచి వచ్చేశాడు. వరుడు అతని బంధువులు జిల్లాలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే తమ్కా పోలీసుస్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.