ఎంత కష్టం వచ్చిందయ్యా మీకు.. పెళ్లి కోసం బ్రహ్మచారుల పాదయాత్ర
Mandya Bachelors to go on Padayatra Seeking Divine intervention to find Brides.సాధారణంగా ప్రజా సమస్యలు
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2023 4:46 AM GMTసాధారణంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయడాన్ని చూస్తూనే ఉంటాం. అన్యాయం జరిగితే నిరసన తెలిపేందుకు పాదయాత్రలు చేస్తుంటారు. పుణ్యక్షేత్రాలకు కొందరు పాదయాత్రగా వెలుతుంటారు. అయితే.. ఓ 200 మంది యువకులు చేపట్టనున్న పాదయాత్ర ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. అదే సమయంలో అందరిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. పెళ్లి కావాలని ఆ యువకులంతా పాదయాత్ర చేపట్టనున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాకు చెందిన 200 మంది యువకులు ప్రముఖ శైవక్షేత్రం మలెమహదేవన బెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్షేత్రం మండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 23న పాదయాత్రగా బయలుదేరి చామరాజనగర జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి మూడు రోజుల్లో చేరుకోనున్నారు.
వ్యవసాయ కుటుంబాలకు చెందిన వీరందరికి పెళ్లి కావడం లేదు. కొందరికి 10 ఎకరాలకు పైగా పొలాలుఉన్నాయి. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ ఆర్థికంగా ఉన్నత స్థితిలోనే ఉన్నారు. అయినప్పటికీ వీరికి పెళ్లి కావడం లేదు. స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా, ఇతర ప్రాంతాల వారు వీరికి పిల్లను ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందరూ 30 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే కావడం గమనార్హం. యాత్రలో పాల్గొనే వారంతా ఖర్చును సమానంగా భరించాలని నిర్ణయించారు.
దీనిపై ఓ మహిళా రైతు నేత మాట్లాడుతూ.. జిల్లాలో ఆడపిల్లల భ్రూణ హత్యల చరిత్ర ఉందని, అందుకనే నేడు వీరు మూల్యం చెల్లించుకుంటున్నారని అన్నారు. నేటితరం అమ్మాయిలు గ్రామాలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని, నగరాలకు వెళ్లాలని కోరుకుంటున్నారని, ఇవన్నీ మండ్యలో వధువుల కొరత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం అని అన్నారు.