అలా ఎలా ప్యాక్ చేశారు.. బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక‌.. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఇంతేనా..!

Man finds rat inside packet of bread delivered by Blinkit.ఒక‌ప్పుడు ఏం కావాల‌న్నా స‌మీపంలోని దుకాణాల వ‌ద్ద‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2023 9:44 AM IST
అలా ఎలా ప్యాక్ చేశారు.. బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక‌.. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఇంతేనా..!

ఒక‌ప్పుడు ఏం కావాల‌న్నా స‌మీపంలోని దుకాణాల వ‌ద్ద‌కు న‌డుచుకుంటూ వెళ్లి తెచ్చుకునేవాళ్లం. టెక్నాల‌జీ పుణ్య‌మా అని ప్ర‌స్తుతం ఏం కావాల‌న్నా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ పెట్టుకుంటే చాలు.. క్ష‌ణాల్లో ఇంటికి కావాల్సిన నిత్యావ‌స‌ర స‌రుకుల‌తో పాటు అన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండానే వ‌స్తున్నాయి. దీంతో స‌మ‌యం, శ్ర‌మ ఆదా అవుతోంది.

ఆన్‌లైన్ సర్వీసుల‌తో ప్ర‌యోజ‌నాల‌తో పాటు స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఆర్డ‌ర్లు మారిపోవ‌డం లేదా నాణ్య‌త లేని వ‌స్తువులు రావ‌డం లేదా పాడైపోయిన‌టువంటివి రావ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుంటాయి. ముఖ్యంగా తినే ఆహార‌ప‌దార్థాల్లో కీట‌కాలు వ‌స్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా ఇలాంటి చేదు అనుభ‌వం ఓ వ్య‌క్తికి ఎదురైంది.

నితిన్ అరోరా అనే వ్య‌క్తి బ్లింకిట్‌లో బ్రెడ్ ప్యాకెట్ ఆర్డ‌ర్ పెట్టారు. కొద్ది స‌మ‌యంలోనే ఆర్డ‌ర్ అత‌డి చేతికి అందింది. ఓపెన్ చూసిన అత‌డు దెబ్బ‌కు షాక్ తిన్నాడు. ఎందుకంటే బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక ఉంది. అది కూడా బ‌తికే ఉంది. ప్యాక్ చేసిన దుకాణ‌దారుడు, తీసుకువ‌చ్చిన డెలివ‌రీ ఏజెంట్ ఎవ‌రూ కూడా ఎలుకను గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నితిన్ అరోరా తెలియ‌జేశాడు. "ఫిబ్ర‌వ‌రి 1న బ్లింకిట్‌లో బ్రెడ్ ఆర్డ‌ర్ ఇచ్చాను. బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక వ‌చ్చింది. 10 నిమిషాల్లో డెలివ‌రీ చేస్తామ‌ని చెప్పి ఇలాంటి తీసుకువ‌స్తుంటే.. వీటిని తీసుకోవ‌డం క‌న్నా డెలివ‌రీ ఆల‌స్యం అయినా ప‌ర్లేదు గానీ మంచి ప్రొడ‌క్ట్‌నే తీసుకోవాలి. ఇది మ‌నంద‌రిని హెచ్చ‌రిస్తుంది." అని నితిన్ ట్వీట్ చేశాడు. అంతేకాదు బ్లింకిట్ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ స్క్రీన్ సాట్‌ను కూడా పంచుకున్నాడు.

నితిన్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలతో చెల‌గాటం ఆడుతారా అంటూ తిట్టిపోస్తున్నారు.

కాగా.. దీనిపై బ్లింకిట్​ స్పందించింది. "కస్టమర్లకు ఇలాంటి అనుభవం ఉండాలని మేము అనుకోవడం లేదు. మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​తో పాటు ఆర్డర్​ ఐడీని మెసేజ్​ చేయండి. మేము పరిశీలిస్తాము." అని బ‌దులు ఇచ్చింది.

Next Story