వీడెవండీ బాబూ.. పెళ్లైన గంటకే భార్యకు విడాకులు.. తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు
Man Divorces his Second wife an hour after marriage.ఓ వ్యక్తి పెళ్లిచేసుకున్న గంటకే భార్యకు విడాకులు ఇవ్వాల్సి
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2023 9:05 AM ISTపెళ్లంటే నూరేళ్ల పంట. జీవితాంతం ఒకరికి ఒకరు, కష్ట సుఖాల్లో తోడు ఉంటామని బాస చేస్తుంటుంటారు. అయితే.. ఓ వ్యక్తి పెళ్లిచేసుకున్న గంటకే భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఓ అనుకోని అతిథి కారణంగా ఇలా జరిగింది. చేసేది లేక ఆమెను అతడి తమ్ముడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
సంభాల్ జిల్లాలోని అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో ఓ వ్యక్తి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. వివాహ తంతు ఇంకా పూర్తి కానే లేదు. ఇంతలోనే ఓ అనుకోని అతిథి కళ్యాణ మండపానికి వచ్చింది. తాను బతికి ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావ్ అని పెళ్లి కొడుకును ప్రశ్నించింది. ఆమె ఎవరో కాదు అతడి మొదటి భార్య. వీరిద్దరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే.. కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో వీరిద్దరు దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో అతడు మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. బుధవారం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య అక్కడకు చేరుకుని అతడిని నిలదీసింది. గొడవ పెద్దదైంది. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. కొద్ది సేపు తర్జన భర్జన అనంతరం ఓ చక్కటి ఉపాయాన్ని ఆలోచించారు. రెండో భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను అతడి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు.
ఈ సలహా నచ్చడంతో మొదటి భార్య సైలెంట్ అయ్యింది. ఇక చేసేది లేక.. గంట క్రితం పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చిన అతడు.. ఆమెను తన తమ్ముడికి ఇచ్చి అక్కడే పెళ్లి చేసేశాడు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వారి గొడవ సద్దుమణిగింది.