32ఏళ్లుగా రాళ్లే అతడి ఆహారం.. ప్రతి రోజూ పావు కేజీపైనే
Maharashtra man living by eating stones for 32 years.పుర్రెకో బుద్ది జిహ్వకో రుచీ అని ఊరుకనే అనలేదు పెద్దలు.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2021 6:04 AM GMTపుర్రెకో బుద్ది జిహ్వకో రుచీ అని ఊరుకనే అనలేదు పెద్దలు. సాధారణంగా మనం ఆకలేస్తే అన్నం తింటాం. ఒక్కో దేశంలో ఒక్కోలా ఆహారపు అలవాట్లు ఉంటాయి. అయితే.. ఆకలేస్తే ఎవరైనా రాళ్లను తింటారా చెప్పండి..? కానీ ఈయన మాత్రం ఆకలిస్తే రాళ్లను బఠాణీల్లా కరకరా నమిలేస్తాడు. ఇది ఏదో ఒకరోజు కాదులెండీ.. గత 32 సంవత్సరాలు ఇతను రాళ్లనే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఇంతకూ అతను ఎవరు అని అంటున్నారా..? అతను ఎవరో కాదు.. మహారాష్ట్రకు చెందిన రామ్‌దాస్ బోడ్కే అనే 72 ఏళ్ల వృద్దుడు. ఇన్ని సంవత్సరాలుగా అతను రాళ్లను తింటున్నా అతడి ఆరోగ్య పరిస్థితి మామూలుగానే ఉంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర సత్రా జిల్లాలోని అదార్కి ఖుర్ద్ గ్రామంలో రామ్‌దాస్ బోడ్కే తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలం క్రితం అతను తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఎంతో మంది డాక్టర్లను కలిసి ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పటికి అతడి పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. చివరకు అతడి గ్రామంలో నివసించే ఓ వృద్ద మహిళ ఓ సలహా ఇచ్చింది. తన సమ్యసకు పరిష్కారంగా ప్రతి రోజూ రాళ్లను తినాలని చెప్పింది. ఇక అప్పటి నుంచి రామ్‌దాస్ బోడ్కే రాళ్లను తినడం ప్రారంభించాడు. ప్రతి రోజూ 250 గ్రాముల రాళ్లను ఆహారంగా తీసుకుంటాడు.
ఇదే అతడి ఆహారం. అతడితో రాళ్లను తినిపించడం ఆపాలని ఆ కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి. కాగా.. అతడు రాళ్లను తింటున్న వీడియోను తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా.. దీనిపై డాక్టర్లను అడుగగా.. రాళ్లను తినడం అనేది అతడి మానసిక సమస్య అయి ఉండొచ్చునని అంటున్నారు.