ఓ వ్యక్తి తన పాటికి తాను నడుచుకుంటూ వెలుతున్నాడు. అయితే.. అకస్మాత్తుగా ఓ ఏనుగుల గుంపు అతడి వైపు రావడాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి సమీపంలో ఉన్న పొడవైన చెట్టును ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఇడుక్కికి చెందిన సాజి అనే వ్యక్తి తన పొలం వద్దకు వెలుతున్నాడు. అతడు వెలుతున్న మార్గంలో ఓ ఏనుగు మంద ఉండడాన్ని గమనించాడు. అతడు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడనప్పటికీ ఆ ఏనుగులు పరుగులాంటి నడకతో అతడి వైపు రావడం మొదలుపెట్టాయి. ఒక్కడే ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చూడగా.. ఓ పొడవాటి చెట్టు కనిపించింది.
వెంటనే సాజి ఆ చెట్టు ఎక్కేశాడు. ఆ ఏనుగులు ఘీంకరిస్తూ అక్కడే ఉండిపోయాయి. దీంతో మరింత భయాందోళన చెందిన అతడు తనను రక్షించాలంటూ చెట్టుపై నుంచే స్థానికులను వేడుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఆ ఏనుగుల గుంపును తరిమివేశారు. దాదాపు గంటన్నర పైగా చెట్టుపైనే ఉన్న సాజీ బతుకు జీవుడా అంటూ కిందకు దిగాడు. ఆ దారిలో వెళ్లవద్దని, అక్కడ ఏనుగుల మంద ఉందని ముందే అతడిని హెచ్చరించినట్లు ఓ అటవీశాఖ అధికారి తెలిపాడు. అయినప్పటికీ అతడు వెళ్లాడని చెప్పారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.