హిజ్రాను ప్రేమించిన భ‌ర్త‌.. పెళ్లి చేసిన భార్య‌

Husband loves hijra and wife taken shocking decision in Kalahandi.. భ‌ర్త ఓ హిజ్రాను ప్రేమించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2022 3:23 AM GMT
హిజ్రాను ప్రేమించిన భ‌ర్త‌.. పెళ్లి చేసిన భార్య‌

భ‌ర్తే లోకంగా బ‌తుకుతుంది భార్య‌. ఇద్ద‌రి మ‌ధ్య మూడో వ్య‌క్తి వ‌స్తే ఏ భార్యా స‌హించ‌దు. ఆ కుటుంబంలో తీవ్ర అల‌జ‌డి చెల‌రేగుతుంది. భ‌ర్త ఓ హిజ్రాను ప్రేమించాడు. ఈ విష‌యం తెలిసిన భార్య కోపంతో ఊగిపోలేదు. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న ప్రేమ‌ను అర్థం చేసుకుంది. ద‌గ్గ‌రుండి మ‌రీ హిజ్రాతో భ‌ర్త‌కు వివాహాన్ని జ‌రిపించింది. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కలహండి జిల్లాలోని నార్ల బ్లాక్ పరిధిలోని ధుర్కూటి గ్రామానికి చెందిన ఫకీర్ నియాల్‌కు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. ఆ దంప‌తుల‌కు ఏడాదిన్న‌ర పాప ఉంది. కాగా.. ఏడాది క్రితం ఫకీర్ అదే గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమ‌లో ప‌డ్డాడు. కొద్ది రోజుల కింద‌ట ఈ విష‌యం ఫ‌కీర్ భార్య‌కు తెలిసింది. విష‌యం తెలియ‌గానే ఫ‌కీర్ భార్య తన వ్యతిరేకత లేదా ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా.. తన భర్తతో ఈ విషయాన్ని చర్చించింది. వారిద్ద‌రి సున్నిత‌మైన సంబంధాన్ని అర్థం చేసుకోవ‌డ‌మే కాకుండా దాన్ని అంగీక‌రించింది.

సంగీతకు న్యాయం చేయడానికి, ఆమె సంబంధానికి సామాజిక గుర్తింపు ఇవ్వడానికి ఫ‌కీర్ భార్య ఓ నిర్ణ‌యం తీసుకోగా.. అందుకు వారు అంగీక‌రించారు. ట్రాన్స్‌జెండర్లు అనుసరించే పద్ధతుల ప్రకారం ఆదివారం ఫకీర్, సంగీత ల వివాహాన్ని ద‌గ్గ‌రుండి మ‌రీ జ‌రిపించింది.

దీనిపై LGBQT కమ్యూనిటీ సభ్యురాలు ఐషా బెహెరా మాట్లాడుతూ.. ఫ‌కీర్ భార్య తీసుకున్న చ‌ర్య‌ను స్వాగ‌తించారు. చ‌ట్టం మా కమ్యూనిటీకి సమానత్వ హక్కును కల్పించినప్పటికీ, సమాజం మమ్మల్ని బహిరంగంగా అంగీకరించలేదన్నారు. ఈ పరిస్థితిలో సంగీత కు ఒక 'సాధారణ' వ్యక్తితో వివాహం జ‌ర‌గ‌డం ఓ ముంద‌డుగు అని అన్నారు. సమాజంలోని ఇతర సభ్యులు సంఘాన్ని అంగీకరించడానికి ముందుకు రావడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ఐషా చెప్పారు.

తాను ఫ‌కీరును ప్రేమించాన‌ని, ఆయ‌న భార్య కొత్త జీవితం ప్ర‌సాదించింద‌ని, ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉందనే ఆనందాన్ని వ్య‌క్తం చేసింది సంగీత‌.

Next Story