ఇదేం వింత‌.. 12 గంటల్లో 31 గుడ్లు పెట్టిన కోడి..!

Hen makes record by laying 31 eggs in a day.సాధార‌ణంగా కోడి ఒక రోజులో ఎన్ని గుడ్లు పెడుతుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Dec 2022 7:51 AM GMT
ఇదేం వింత‌.. 12 గంటల్లో 31 గుడ్లు పెట్టిన కోడి..!

సాధార‌ణంగా కోడి ఒక రోజులో ఎన్ని గుడ్లు పెడుతుంది అని అడిగితే.. ఆ మాత్రం తెలియదా..? ఒక‌టి. అరుదైన కోళ్లు అయితే రెండు గుడ్లు పెడుతుంటాయ‌ని చెప్పేస్తుంటారు. అంత‌క‌మించి గుడ్లు పెట్ట‌డం ఇప్ప‌టి వ‌ర‌కు అయితే మ‌న‌కు తెలీదు. అయితే.. ఓ కోడీ ఏకంగా 31 గుడ్లు పెట్టింది. అది కూడా 12 గంట‌ల వ్య‌వ‌ధిలో. చ‌ద‌వ‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజ‌మ‌ని అంటున్నాడు ఉత్త‌రాఖండ్‌కు చెందిన ఓ వ్య‌క్తి. ఆ మ‌రీ అస‌లు సంగ‌తి ఏంటీ..? అత‌డు ఏం చెబుతున్నాడు అంటే..?

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలోని బాసోత్ గ్రామంలో గిరీశ్ చంద్ర బుధాని అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇత‌డు టూర్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థలో ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అత‌డికి కోళ్ల‌ను పెంచ‌డం అంటే చాలా ఇష్టం. కొన్నాళ్ల క్రితం గిరీష్ రూ.200 పెట్టి రెండు కోడి పిల్ల‌ల‌ను కొన్నాడు. వాటిని వేరు శెన‌గ‌ల‌తో పాటు వెల్లుల్లి ఆహారంగా పెట్టేవాడు.

వాటిలో ఓ కోడి ఇటీవ‌ల రోజుకు రెండు గుడ్లు పెడుతోంది. ఇది సాధార‌ణ విష‌య‌మేన‌ని అత‌డు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే.. డిసెంబ‌ర్ 25న అత‌డు ఇంటికి వ‌చ్చే స‌రికి కోడి 5 గుడ్లు పెట్టింద‌ని అత‌డి పిల్ల‌లు చెప్పారు. అది వినీ గిరీష్ ఆశ్చ‌ర్య‌పోయాడు. ప్రతీ 10 -15 నిమిషాలకు ఒక‌టి చొప్పున మొత్తం 31 గుడ్లు పెట్టింది. దీంతో కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

కోడికి ఏమైన వ్యాధి సోకిందేమోన‌ని వెంట‌నే గిరీష్ దాన్ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్లాడు. కాగా.. దానికి ఎలాంటి రోగం లేద‌ని వైద్యుడు చెప్ప‌డంలో అత‌డు ఊపిరిపీల్చుకున్నారు. విష‌యం చుట్టు ప‌క్క‌ల వారికి తెలియ‌డంతో ఆ కోడిని, గుడ్ల‌ను చూసేందుకు ప్ర‌జ‌లు గిరీశ్ ఇంటికి క్యూ క‌ట్టారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో త‌న కోడి పేరును న‌మోదు అయ్యేలా చూడాల‌ని గిరీష్ ప్ర‌య‌త్నించాల‌ని స్థానికులు సూచిస్తున్నారు.

దీనిపై గిరీష్ మాట్లాడుతూ.. ప్ర‌తీ రోజు 200గ్రాముల వేరు శనగ గింజలు ఈ కోడికి మేతగా వేస్తాం. అలానే వెల్లుల్లీని కూడా పెడతాను. రోజు ఒక్క గుడ్డు పెట్టేది. కొన్ని రోజులుగా 2 గుడ్లు పెడుతుంది. అయితే..డిసెంబర్‌ 25న మాత్రం ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఇలా ఎందుకు జ‌రిగిందో మాత్రం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు.

Next Story