త‌నని తానే పెళ్లి చేసుకోనున్న యువ‌తి.. ఇండియాలో ఇదే తొలిసారి

Gujarat Woman To Marry Herself In Sologamy.ఇద్ద‌రిని ఒక్కటి చేసేది పెళ్లి. ఒకప్పుడు ఆడ‌, మ‌గ మాత్రమే పెళ్లి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2022 4:48 PM IST
త‌నని తానే పెళ్లి చేసుకోనున్న యువ‌తి.. ఇండియాలో ఇదే తొలిసారి

ఇద్ద‌రిని ఒక్కటి చేసేది పెళ్లి. ఒకప్పుడు ఆడ‌, మ‌గ మాత్రమే పెళ్లి చేసుకొనేవారు. అయితే.. ఇప్పుడు రోజులు మారాయి. లింగ బేధాల తారతమ్యం లేకుండా స్వలింగ సంపర్కులు వివాహాం చేసుకుంటున్నారు. ఇంకొందరు చెట్లు, బెడ్‌షీట్లు ఇలా తమకు నచ్చిన వస్తువులు, జంతువులను సైతం పెళ్లాడ‌టాన్ని విదేశాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే పెళ్లి ఆ టైపు కాదు. ఈ పెళ్లిలో మీకు వధువు మాత్రమే ఉంటుంది. వరుడు ఉండదు. అలాగని ఆమె మరో యువతిని పెళ్లి చేసుకుంటుదని కూడా అనుకోవద్దు. త‌న‌ను తానే పెళ్లి చేసుకుంటోంది. అవునండీ ఇదెక్క‌డో కాదు మ‌న‌దేశంలోనే.

వివ‌రాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు అనే యువ‌తి త‌న‌ను తానే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. జూన్ 11న హిందూ సంప్ర‌దాయ ప్ర‌కారం త‌న‌కు తానుగా మూడు ముళ్లు వేసుకుని వివాహం చేసుకోనుంది. గోత్రీలోని గుడిలో జరగనున్న ఈ వివాహంలో ఐదు ప్రమాణాలు కూడా చేయనుంది. అంతేకాదండోయ్‌.. వివాహం అనంత‌రం గోవాలో రెండు వారాల హనీమూన్ కోసం ఆమె ఇప్ప‌టికే ప్లాన్ చేసుకుంది. కాగా.. భారతదేశంలో ఇలాంటి వివాహం జరగడం ఇదే తొలిసారి.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ నేను వధువు కావాలని కోరుకున్నాను. అందుకే న‌న్ను నేనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి నేను ఆన్‌లైన్‌లో విస్తృతంగా చదివాను. అయితే భార‌త దేశంలో ఇలాంటి వివాహాం ఇంత వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. 'సెల్ఫ్ మ్యారేజ్' అనేది నీకు నువ్వే హద్దులు లేని ప్రేమ చూపించుకునేది. ఇది నువ్వు నిన్నే ఒప్పుకోవాల్సింది. కొందరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ.. నన్ను నేను ప్రేమిస్తున్నా.. అందుకే పెళ్లి చేసుకుంటున్నా 'అని క్ష‌మా చెప్పుకొచ్చింది. ఇక ఈ పెళ్లికి త‌న త‌ల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story