పెళ్లి పీటలపై గురకపెట్టి మరీ నిద్రపోయిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
తన పెళ్లిలో ఓ పెళ్లి కొడుకు గురకపెట్టి మరీ పెళ్లిపీటలపైనే నిద్ర పోయాడు. దీంతో వధువు కు కోపం వచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 7:47 AM ISTపెళ్లిపీటలపైనే నిద్ర పోయిన వరుడు
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన రోజు. కొత్త జీవితానికి నాంది పలికే రోజు. ఎన్నో ఊహలతో ఓ యువతి పెళ్లి మండపానికి చేరుకుంది. బంధువులు, మిత్రులతో అక్కడ అంతా ఎంతో సందడిగా ఉంది. అయితే.. పెళ్లి కొడుకు మాత్రం మద్యం సేవించి వచ్చాడు. కనీసం పంతులు చెప్పే మంత్రాలను కూడా చదివే స్థితిలో లేడు. ఓ వైపు పెళ్లి తతంగం జరుగుతుండగా వరుడు మాత్రం పీటలపైనే గురక పెట్టి నిద్రపోయాడు. దీంతో ఈ వరుడు నా కొద్దు అంటూ పెళ్లి కూతురు పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని నల్బరీ జిల్లాలో చోటు చేసుకుంది.
నల్‌బరి పట్టణానికి చెందిన ప్రసేన్‌జీత్ హలోయ్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే.. వరుడు ప్రసేన్‌జీత్ హలోయ్ మాత్రం మద్యం తాగి మండపానికి వచ్చాడు. అతడే కాదు అతడి బంధువుల్లో దాదాపుగా అందరూ మద్యం సేవించే మండపానికి వచ్చారు.
పెళ్లి కుమారుడి వాలకాన్ని చూసిన వధువు పెళ్లి పీటలపై కూర్చొనని చెప్పింది. అయితే.. బంధువులు, స్నేహితులు నచ్చజెప్పడంతో వరుడి పక్కన కూర్చొంది. పంతులు పెళ్లి తతంగాన్ని ప్రారంభించారు. పంతులు చెబుతున్న మంత్రాలను కూడా పట్టించుకునే స్థితిలో వరుడు లేడు. ఏకంగా పీటలపైనే గురక పెట్టి మరీ నిద్ర పోయాడు. వధువు కోపం నశాలానికి అంటింది. వెంటనే పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది.
ఎవ్వరు ఏం చెప్పినా అతడిని పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. పెళ్లి కొడుకు తీరుపై వధువు తరుపు వారు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. అంతేకాకుండా నల్‌బరి పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. .పెళ్లి ఖర్చును చెల్లించాలంటూ వరుడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.