ఒకప్పుడు ఎవరిదైనా అడ్రస్ కనుక్కోవాలంటే పక్కవారినో, ఆ వీధిలోని కిరాణషాపు వాళ్లనో అడిగి తెలుసుకుని కరెక్ట్ అడ్రస్‌కు చేరుకునేవారు. అయితే.. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత పక్కవారిని అడగడం మరిచిపోయారు. ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే.. కొన్ని సార్లు మ్యాప్స్ తప్పులు చూపించడంతో అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో విదేశాల్లో ఓ వ్యక్తి రోడ్డును కూడా చూడకుండా మ్యాప్‌ను చూస్తూ డ్రైవర్ చేసుకుంటూ.. నదిలోకి కారును పోనిచ్చాడు. ఇలాంటి ఘటనలు కొన్ని సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. మరీ మ్యాప్స్‌ను అంత గుడ్డిగా నమ్మకూడదని తాజాగా జరిగిన ఓ ఘటన తెలియజేస్తుంది.
ఇండోనేషియాలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ జావాలోని లొసారి హామ్లెట్ అనే గ్రామంలోని వధువు ఇంట్లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వధువు ఇంటికి వెళ్లేందుకు వరుడి పాటు అతడి కుటుంబ సభ్యులు తమ గ్రామం నుంచి బయలుదేరారు. దారి కోసం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు. అయితే.. అది అక్కడికి సమీపంలో ఉన్న జెంగ్‌కోల్ హామ్లెట్ అనే గ్రామానికి తీసుకువెళ్లింది. అయితే.. ఆ గ్రామంలో కూడా ఓ యువతికి నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతోంది.
వారి ఇంటి ముందు కూడా టెంట్ వేసి ఉంది. దీంతో ఇదే వధువు ఇళ్లు అని భావించిన వరుడి కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లారు. అక్కడ వారు కూడా తొలుత వీరు నిశ్చిత్థారం కోసం వచ్చిన వారిగా భావించి మర్యాదలు చేశారు. అయితే.. వీరు పెళ్లి సరంజామాతో రావడంతో ఆ యువతి షాకైంది. అనంతరం తప్పును గుర్తించి అందరికి చెప్పింది. ఇక అసలు విషయం తెలుసుకున్న వరుడు తాను ఒక ఇంటికి బదులుగా మరో ఇంటికి వచ్చామని తెలుసుకొని వాళ్లకు క్షమాపణలు చెప్పి కరెక్ట్ అడ్రస్ ను పట్టుకొని అక్కడికి వెళ్లారు.