ఏదైన పండుగ వచ్చిదంటే కొన్ని రంగాల్లో మినహా మిగిలిన అందరికి సెలవులు ఉంటాయి. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా సరే పోలీసులకు మాత్రం పండుగల సమయంలో అంత సులువుగా సెలవులు దొరకవు అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మధ్య డ్యూటీ చేస్తూనే వారు పండుగలను చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ ఓ పోలీసు అధికారి తన ఉన్నాధికారికి సెలవు కావాలని రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"22 ఏళ్ల నుంచి నా భార్య హోలీకి తన పుట్టింటికి తీసుకువెళ్లమని అడుగుతోంది. అయితే నా ఉద్యోగం రీత్యా అది సాధ్యం కాలేదు. దీంతో నా భార్య నా పై కోపంగా ఉంది. ఈ సారి హోలీకి తీసుకువెళ్లాల్సిందేనని పట్టుబడుతోంది. ఆమెను శాంతింపజేయడానికి 10 రోజులు(మార్చి 4 నుంచి ) సెలవులు కావాలి." అని ఫరూఖాబాద్ ఎస్పీ అశోక్ కుమార్ మీనాకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ లీవ్ లెటర్ రాశాడు.
ఇన్‌స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్
ఈ లేఖను చూసి ఎస్పీ నవ్వినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే.. ఇన్‌స్పెక్టర్ అడిగినట్లు 10 రోజులు కాకుండా 5 రోజులు సెలవులు ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.