వీడి దుంప‌తెగ‌.. మ‌ద్యం మ‌త్తులో మండ‌పానికి వెళ్ల‌డం మ‌రిచిపోయిన పెళ్లికొడుకు

మ‌ద్యం మ‌త్తులో ఓ పెళ్లి కొడుకు ముహూర్త స‌మ‌యాన్ని మ‌ర్చిపోయాడు. చాలా ఆల‌స్యంగా మండ‌పానికి వెళ్లాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2023 9:52 AM IST
Drunk Man forgets his wedding, Bihar

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్కరి జీవితంలో ఎంతో మ‌ధుర‌మైన రోజు. ఆ రోజు కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే.. ఓ వ‌రుడు స్నేహితులు బ‌ల‌వ‌తం చేశారో, లేక త‌న‌కు పెళ్లి జ‌ర‌గ‌బోతుంద‌న్న ఆనందంలో తాగాడో తెలీదు గానీ పుల్‌గా మందు కొట్టాడు. మ‌ద్యం మ‌త్తులో ముహూర్త స‌మ‌యాన్ని మ‌ర్చిపోయాడు. కొద్ది సేప‌టి త‌రువాత‌ ఆ విష‌యం గుర్తొచ్చి చాలా ఆల‌స్యంగా క‌ల్యాణ మండ‌పానికి చేరుకున్నాడు. మ‌ద్యం మ‌త్తు ఎక్కువ కావ‌డంతో తూలుతూనే మండ‌పం పైకి చేరుకున్నాడు. వ‌రుడి కోసం చాలా సేప‌టి నుంచి ఎదురుచూసిన వ‌ధువు.. అత‌డిని అలాంటి ప‌రిస్థితుల్లో చూసి త‌న‌కు అత‌డు వ‌ద్దే వద్దు అని చెప్పేసింది.పెళ్లిని ర‌ద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. భాగల్పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్ గంజ్ గ్రామానికి చెందిన ఓ యువ‌తితో పెళ్లిని నిశ్చ‌యం చేశారు పెద్ద‌లు. మంగ‌ళ‌వారం అంగ‌రంగ‌వైభవంగా పెళ్లిని చేసేందుకు ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. బంధు మిత్రులు, అతిథుల‌తో క‌ల్యాణ మండ‌పం కోలాహ‌లంగా ఉంది. వ‌ధువు క‌ల్యాణ‌మండ‌పానికి చేరుకుంది. వారి ఆచారం ప్ర‌కారం పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసింది. అయితే.. వ‌రుడు ఇంకా రాలేదు. అత‌డి కోసం ఎదురుచూడ‌సాగింది.

ముహూర్త స‌మ‌యం దాటింది. అయినా వ‌రుడి జాడ లేదు. అత‌డు ఎక్క‌డ ఉన్నాడు అని ఆరా తీస్తున్నా ఫ‌లితం లేక‌పోయింది. ఉద‌యం క‌ల్యాణ మండ‌పానికి రావాల్సిన వ‌రుడు తీరిగ్గా మ‌ధ్యాహ్నాం మ‌ద్యం మ‌త్తులో తూలుతూ వ‌చ్చాడు. అత‌డిని అలా చూసి వ‌ధువు షాక్‌కు గురైంది. ఎంతో ముఖ్య‌మైన పెళ్లి రోజునే ఇలా జ‌రిగిందంటే.. పెళ్లి త‌రువాత త‌న ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందింది. అత‌డితో పెళ్లికి నిరాక‌రించింది. దీంతో చేసేది లేక పెళ్లిని ర‌ద్దు చేసుకున్నాయి ఇరుకుటుంబాలు.

Next Story