చితికి నిప్పటించడానికి ముందు నోట్లో గంగాజలం.. లేచి కూర్చున్న వృద్దుడు..!
Dead man found Breathing in Cemetery.ఈ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.
By తోట వంశీ కుమార్ Published on 28 Dec 2021 11:05 AM ISTఈ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అవి నమ్మాలో లేదో అర్థం కాదు. కొందరు వాటిని నిజమని నమ్మితే మరికొందరు అబద్దం అంటూ కొట్టిపారేసుకుంటారు. తాజాగా అనారోగ్యం కారణంగా ఓ వృద్దుడు మరణించాడని వైద్యులు నిర్థారించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వృద్దుడి దేహాన్ని చితిపై పడుకోబెట్టారు. చివరగా అతడి నోట్లో గంగాలం పోశారు. అంతే ఆ వృద్దుడు కళ్లు తెరిచి మాట్లాడాడు. దీంతో అక్కడ ఉన్నవారు తొలుత ఆశ్చర్యపోయినా.. తరువాత తేరుకుని ఆ వృద్దుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఆశ్చర్యకర ఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో సతీశ్ భరద్వాజ్(62) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలంగా అతడు కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. అయితే.. సోమవారం తెల్లవారుజామున అతడు మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు కుటుంబసభ్యులకు తెలిపాయి. అతడి మరణాన్ని ఏకంగా 11 మంది వైద్యులు నిర్థారించడం గమనార్హం. దీంతో కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
చితిపై సతీశ్ భరద్వాజ్ దేహాన్ని ఉంచారు. నిప్పంటిచడానికి ముందు అతడి నోట్లో గంగాజలాన్నిపోశారు. అంతే ఆ వృద్దుడిలో కదలిక వచ్చింది. వెంటనే కళ్లుతెరిచి మాట్లాడాడు. తొలుత అక్కడున్న వారంతా అవాక్కైయ్యారు. తేరుకుని వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీనిని అద్భుతం అని అంటుండగా.. మరికొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలా జరిగిందని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.