ఈత‌కొడుతుండ‌గా మొస‌లి దాడి.. ఏం జ‌రిగిందంటే..?

Crocodile attacks swimmer.కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ప‌రిసరాల గురించి పూర్తిగా తెలుసుకోవ‌డం చాలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2021 4:47 PM IST
ఈత‌కొడుతుండ‌గా మొస‌లి దాడి.. ఏం జ‌రిగిందంటే..?

కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ప‌రిసరాల గురించి పూర్తిగా తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. లేదంటే ఒక్కోసారి అపాయం జ‌ర‌గొచ్చు. ఓ వ్య‌క్తి స‌రస్సు క‌న‌ప‌డ‌గానే.. ముందు వెనుకా ఆలోచించ‌కుండా అందులోకి దిగి ఈత కొడుతున్నాడు. ఇంత‌లో ఓ మొస‌లి అత‌డిపై దాడి చేసింది. అత‌డు ఎంతో వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు కానీ.. కొన్ని గాయాలు మాత్రం అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న బ్రెజిల్‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. కెటానో అనే వ్య‌క్తి క్యాంపో గ్రాండెలోని లాగో డో అమోర్‌ సరస్సు వ‌ద్ద‌కు వెళ్లాడు. ఆ స‌ర‌స్సు మొస‌ళ్ల‌కు ప్ర‌సిద్ది. అయితే.. అత‌డికి ఈత కొట్టాల‌ని అనిపించింది. దీంతో వెంట‌నే అత‌డు స‌ర‌స్సులోకి దిగాడు. ఈత‌కొడుతూ.. నిషేదిత ప్ర‌దేశానికి దాటి వెళ్లిపోయాడు. ఓ మొస‌లి కెటానో వైపు వేగంగా వ‌చ్చి దాడి చేసింది. నీటిలో అల‌జ‌డి కావ‌డంతో వెన‌క్కి తిరిన కెటానో.. మొస‌లి త‌న వైపు రావ‌డాన్ని గ‌మ‌నించాడు. అంతే వేగంగా అత‌డు కూడా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే.. అప్ప‌టికే అత‌డి చేతికి, శ‌రీర భాగాల‌ను మొస‌లి గాయ‌ప‌రిచింది. ఈ ఘ‌ట‌న మొత్తాన్ని విల్యాన్ కెట‌నో అనే వ్య‌క్తి ఒడ్డుపై ఉండి వీడియో తీశాడు. సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా వైర‌ల్‌గా మారింది. అదృష్టం బాగుంది కానీ.. లేదంటేనా అంటూ నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story