పిల్లి కోసం లొల్లి.. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
Clashed for cat in Huzurnagar.సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు భూ తగాదాలు, ఆస్తి తగాదాలు, పక్కంటి వ్యక్తులు దూషించారనే
By తోట వంశీ కుమార్ Published on 22 Feb 2022 1:55 PM GMTసాధారణంగా పోలీస్ స్టేషన్‌కు భూ తగాదాలు, ఆస్తి తగాదాలు, పక్కంటి వ్యక్తులు దూషించారనే ఫిర్యాదులు రావడం సహజం. అయితే.. అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులకు పరేషాన్ తెప్పిస్తుంటాయి. ఇది చూసిన జనాలకు కూడా ఇందుకోసమా అంత హైరానా పడ్డారు అంటూ అనుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ పంచాయతీనే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఓ పిల్లి కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. పిల్లి మాదంటే కాదు మాది అంటూ ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాయి.
వివరాల్లోకి వెళితే.. హుజూర్‌నగర్ పట్టణంలోని నివసిస్తున్న ముత్యాలమ్మ అనే మహిళ కొంతకాలం క్రితం ఓ పిల్లిని మైసూర్ నుంచి తెప్పించుకుంది. నలుపు, తెలుపు రంగులతో ముచ్చటగొలిపేలా ఉన్న దాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. 15 నెలల క్రితం ఆ పిల్లి తప్పిపోయింది. దాని కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. ముత్యాలమ్మ పిల్లలు ఆడుకుంటూ సుక్కమ్మ అనే మహిళ వద్ద ఉన్న పిల్లిని గుర్తించారు. దీంతో ఇరు వర్గాలు పిల్లి మాదంటే కాదు మాది అంటూ గొడవకు దిగారు. తాను 5 వేలకు పిల్లిని కొన్నానని సుక్కమ్మ చెబుతోంది. ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో తెలీదు కానీ ఇరు వర్గాలకు చెందిన ఓ 50 మంది ఒకేసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
అంత మంది ఒకేసారి రావడంతో ఏం జరిగిందోనని పోలీసులు తొలుత కంగారు పడ్డారు. తీరా వారు చెప్పింది విన్నాక పోలీసులకు నోట మాట రాలేదు. తమకు న్యాయం చేయాలని ఇరు వర్గాలు వారు అంటున్నారు. ఇక ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. కాగా.. ప్రస్తుతం సమస్యకు కారణమైన పిల్లి పోలీస్ స్టేషన్‌లో భద్రంగా ఉంది.