కరోనా టీకా తీసుకోండి.. రూ.840 కోట్లు పట్టుకెళ్లండి
California to offer $116 million in Covid vaccine prize money.ఓ వైపు భారత్‌లో టీకాలు దొరక్క ఇబ్బందులు పడుతుంటే..
By తోట వంశీ కుమార్ Published on 29 May 2021 1:48 PM ISTఓ వైపు భారత్‌లో టీకాలు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు అమెరికాలో టీకాలు తీసుకోవడానికి రండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ ఓ అడుగు ముందుకేసీ టీకా తీసుకొండి 116 మిలియన్ డాలర్ల లాటరీ జాక్‌పాట్ కొట్టేయండి అంటూ వినూత్న ప్రచారం చేపట్టారు. జూన్ 15 నుంచి అక్కడ ఆంక్షలు ఎత్తివేసి, సాధారణ జీవనానికి మార్గం సుగమం చేయనున్న క్రమంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది.
కాలిఫోర్నియా రాష్ట్రంలో 3.4 కోట్ల మంది జనాభా ఉండగా.. ఇప్పటి వరకు 63శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అక్కడ 12 ఏళ్లు దాటిన వారందరికి టీకా ఇస్తున్నారు. టీకా తీసుకొమ్మని కొన్ని నెలలుగా ప్రచారం చేసినా ఇంకా చాలా మంది తీసుకోలేదు. దీంతో మిగిలిన వారందరికీ వీలైనంత త్వరగా తొలిడోసు అందించేందుకు ప్రైజ్ మనీ ఆఫర్‌ను గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు. కనీసం తొలి డోసు తీసుకున్న వారే దీనికి అర్హులు.
ఈ లాటరీ లక్కీ డ్రా జూన్ 4తో ప్రారంభమవుతుంది. 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు(సుమారు రూ.10.86కోట్లు), 30 మందికి 50,000 డాలర్లు(రూ.36.21లక్షలు) నగదుతో పాటు 20 లక్షల మందికి 50 డాలర్ల(రూ.3600) విలువైన గిఫ్ట్ కూపన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఆఫర్లను ఇప్పటికే ఒహాయో, కొలరాడో, ఒరేగాన్ రాష్ట్రాల్లో ప్రకటించారు.