తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరో యువకుడిని పెళ్లిచేసుకున్న వధువు
Bride Marries Another Man After Groom Kept Dancing And Drinking With Friends.తనకు పెళ్లి అవుతుందన్న ఆనందంలో వరుడు..
By తోట వంశీ కుమార్ Published on 18 May 2022 5:43 AM GMT
తనకు పెళ్లి అవుతుందన్న ఆనందంలో వరుడు.. తన మిత్రులతో కలిసి మద్యం తాగాడు. బరాత్‌లో డ్యాన్సులు వేస్తూ మూహూర్త సమయాన్ని సైతం మర్చిపోయాడు. ఆలస్యంగా మండపానికి చేరుకున్నాడు. అతడి వాలకాన్ని చూసిన వధువు.. అతడిని పెళ్లి చేసుకోనని చెప్పేసింది. వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా చెలానా గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సునీల్ వివాహం ఈ నెల 15న అర్థరాత్రి 1.15 గంటలకు చేయాలని పెద్దలు నిశ్చయించారు. దీంతో ముందు రోజు సాయంత్రమే వధువు గ్రామానికి సునీల్ తన బంధుమిత్ర గణంతో చేరుకున్నాడు. రాత్రి తొమ్మిది గంటలకు బరాత్ మొదలైంది. బరాత్‌లో తన మిత్రులతో కలిసి తప్పతాగి చిందులేసిన వరుడు ముహూర్త సమయాన్నికూడా మరిచిపోయాడు. ఆలస్యంగా మండపానికి చేరుకున్నాడు.
మద్యం మత్తులో ఉన్న అతడిని చూసి వధువు చీదరించుకుంది. అతడిని చేసుకునేది లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. అక్కడే ఉన్న బంధువుల అబ్బాయిని వధువు వివాహం చేసుకుంది. దీంతో వరుడి తరుపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు ఇప్పుడే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తాడో అన్న భయంతో వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు వధువు కుటుంబం తెలిపింది.