సరిలేరు..'టీమిండియా'కు ఎవ్వరూ..

By Newsmeter.Network  Published on  24 Jan 2020 6:57 PM IST
సరిలేరు..టీమిండియాకు ఎవ్వరూ..

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌ లో టీమిండియా 204 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 203/5 చేయగా.. భారత్ ఆ లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలి ఉండగానే చేధించింది. ఈ క్రమంలో టీ20ల్లో 200 పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడంతో టీమిండియా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇలా ఇప్పటి వరకు భారత్‌ నాలుగు సార్లు 200 పైగా లక్ష్యాలను చేధించి.. ఛేజింగ్‌లో సరిలేరు నీకెవ్వరు అని ఫ్యాన్స్‌తోపాటు ప్రత్యర్థులతోనూ అనిపించుకుంటోంది.

2009 మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ లో మొదటి సారి టీమిండియా టీమిండియా రెండొందలకు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 211 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ ఫార్మాట్‌ లో టీమిండియాకు ఇదే అత్యధిక చేధన. 2013లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 209 పరుగుల్ని ఛేజ్ చేసి, ఇక రెండోసారి ఈ ఘనత సాధించింది. ఇక 2013లో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించి ముచ్చటగా మూడోసారి 200+ స్కోరును ఛేజ్ చేసింది. కివీస్‌పై తాజా ఛేదన నాలుగోసారి కావడం విశేషం. టీమిండియా తరువాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే 200+ స్కోర్‌ ను చేధించింది. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌లు తలోసారి మాత్రమే రెండొందలకుపైగా టార్గెట్‌ను ఛేదించిన జట్లు.

అర్థశతకాలతో మోతెక్కించారు..

Taylor

ఇదిలా ఉండగా ఈ మ్యాచ్‌ లో మరో రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు పరుగుల మోత మోగించారు. ఈ క్రమంలోనే ముగ్గురు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు యాభైకి పైగా పరుగులు చేయగా, ఇద్దరు భారత ఆటగాళ్లు అర్థశతకాలను బాదేశారు. కివీస్‌ ఆటగాళ్లలో మున్రో( 59), విలియమ్సన్‌(51), రాస్‌ టేలర్‌(54 నాటౌట్‌)లు హాఫ్‌ సెంచరీలు సాధించగా, భారత్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌(56), శ్రేయస్‌ అయ్యర్‌(58 నాటౌట్‌)లు అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా, ఇలా ఒక అంతర్జాతీయ టీ20లో ఐదుగురు బ్యాట్స్‌మన్లు యాభైకి పరుగుల్ని సాధించడం ఇదే తొలిసారి.

Next Story