శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2020 11:22 AM GMT
శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్

సంచలనం సృష్టించిన పెందుర్తి శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నూతన్‌ భార్య ప్రియమాధురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న నూతన్‌ను అరెస్ట్ చేసినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. నూతన్‌ని కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్‌ సీజ్ చేశామని.. నూతన్ భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని సీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్‌ చేశామన్నారు. నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు.

ఏం జరిగిందంటే..?

విశాఖ నగర పరిధిలోని సుజాతానగర్‌లో ఉన్న నూతన్‌ ఇంట్లో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. నిర్మాత ఇంట్లో గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ 4 నెలలుగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల తర్వాత మానేసిన నేపథ్యంలో నూతన్‌ ఇంటి భద్రతా సిబ్బంది శ్రీకాంత్‌ను పిలిపించారు. పని ఎందుకు మానేశావని ప్రశ్నించి.. అనంతరం గతంలో ఈ ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ శ్రీకాంత్‌ను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా సమీపంలోని క్షురకుడిని పిలిపించి శిరోముండనం చేశారు. ఆ సమయంలో నూతన్‌ భార్య అక్కడే ఉన్నారని బాధితుడు తెలిపాడు. శిరోముండనం ఘటనపై శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా మొదట ఈ కేసులో ఏడుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ నూతన్‌ను అరెస్ట్ చేశారు.

Next Story