లాక్ డౌన్ ఎత్తివేతతో ఉద్యోగాలు ఊడనున్నాయా ?
By రాణి Published on 6 April 2020 7:04 AM GMTకరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ విధించారు ప్రధాని మోదీ. ఈ లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14తో ముగియనుంది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ఉంటుందన్న విషయం ఇప్పుడు తెరపైకొచ్చిన తాజా అంశం. లాక్ డౌన్ ప్రకటించినప్పుడే చిన్న, మధ్య తరహా ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు ఒక నెల జీతం చెల్లించి..ఉద్యోగాల నుంచి తీసివేశాయి. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ఎత్తివేస్తారన్న గ్యారెంటీ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ కారణంగా దేశంలో ఉద్యోగాల్లో భారీ కోతలుంటాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) స్పష్టం చేసింది. ఈ సంస్థ గతవారం 200 కు పైగా కంపెనీల సీఈఓలతో చేసిన సర్వేలో పలు ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి. లాక్ డౌన్ గడువు పూర్తయ్యాక చాలా ఉద్యోగ సంస్థల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ఉంటుందని 52 శాతం సీఈఓలు చెప్పినట్లు సీఐఐ పేర్కొంది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు.
లాక్ డౌన్ కారణంగా వివిధ కంపెనీలు 10 శాతం కన్నా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. లాభంలో 5 శాతం కన్నా ఎక్కువే క్షీణత ఉంటుందని పలు సంస్థలు వెల్లడించాయి. దీంతో ఉద్యోగాలపై కోత తప్పదన్న భావనే ఎక్కువగా వ్యక్తమవుతోంది. అదే జరిగితే 15 శాతం కన్నా ఎక్కువ ఉద్యోగ కోతలు తప్పవు. మరోవైపు లాక్ డౌన్ తో నష్టపోయిన పరిశ్రమల అభివృద్ది కోసం ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించి, దానిని ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో అమలు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సీఈఓలు. ఉద్యోగాల కోత మాత్రం తప్పదు..దీంతో లక్షల మంది ఉద్యోగులు మళ్లీ రోడ్డున పడనున్నారు. నిరుద్యోగుల కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ సంస్థలు వర్క ఫ్రమ్ హోమ్ ఇస్తే..మరికొన్ని సంస్థలు ఆల్టర్ నేట్ షిఫ్ట్ పద్ధతుల్లో కంపెనీలను నడిపిస్తున్నాయి. ఇంకొన్నైతే జీతాలు చెల్లించలేక ఏకంగా ఉద్యోగులను తొలగించేశాయి. పరిస్థితి అదుపులోకి వచ్చాక కొత్త ఉద్యోగులను తీసుకోవచ్చన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికాలో ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారంతా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ సంఖ్య త్వరలోనే కోటికి చేరే అవకాశం ఉన్నట్లు అక్కడి ఆర్థిక వేత్తల అంచనా.