ఎన్టీఆర్ అభిమానులకు.. హీరోయిన్‌కు మధ్య సోషల్‌మీడియా వార్.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jun 2020 12:29 PM ISTసోషల్ మీడియాలో సినిమా అభిమానులకు ఏదో ఒక వివాదం లేనిదే పొద్దుపోదు. అలాంటి వాళ్లకు మంగళవారం సాయంత్రం మంచి మసాలా అందించింది హీరోయిన్ మీరా చోప్రా. ఈ ఉత్తరాది భామ రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది. అందులో దక్షిణాది చిత్రాలే ఎక్కువ. కానీ పాపం.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడలేదు. చాలా త్వరగా తెరమరుగైపోయిన ఈ భామ.. అనుకోకుండా తన ఫాలోవర్లతో చిట్ చాట్ కార్యక్రమం పెట్టింది.
ఈ సందర్భంగా తెలుగు హీరోలు ఒక్కొక్కరి గురించి స్పందించింది. తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరంటే మహేష్ బాబు పేరు చెప్పింది. పవన్ కళ్యాణ్ గురించి అడిగితే పొగిడింది. కానీ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో గురించి చెప్పమంటే మాత్రం అతనెవరో తెలియదు అనేసింది. తాను అతడి ఫ్యాన్ కాదని అంది. దీంతో తారక్ అభిమానులకు మండిపోయి ఆమెను నానా తిట్లు తిట్టారు. వాటన్నింటినీ పట్టుకుని మీరా దీన్ని పెద్ద ఇష్యూ చేసింది.
వ్యవహారం తారక్ ఫ్యాన్స్ మీద సైబర్ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. మహిళల హక్కుల కోసం సోషల్ మీడియాలో పోరాడే చిన్మయి కూడా రంగంలోకి దిగడంతో వివాదం ఇంకాస్త పెద్దదైంది. ఐతే ఇలా హీరోయిన్లు చిట్ చాట్‌లు పెడితే తమ హీరో గురించి చెప్పమని వాళ్లను డిమాండ్ చేయడం అభిమానుల తప్పు. మీరా తన అభిప్రాయం ఏదో చెబితే ఆమెను బూతులు తిట్టడమూ తప్పే.
ఐతే మీరా.. తారక్ గురించి తనకు తెలియదు. ఏం మాట్లాడలేను అంటే సరిపోయేది కానీ.. ఆమె అతనెవరో తెలియదని, తాను అతడి ఫ్యాన్ కాదని చెప్పడమే టూమచ్. పదేళ్ల కిందట్నుంచి దక్షిణాది సినిమాల్లో నటిస్తూ.. తెలుగులో కూడా మూణ్నాలుగు సినిమాలు చేసిన మీరాకు తారక్ తెలియదని అంటే ఎలా నమ్మగలం? ఇలా చేసి తారక్ అభిమానుల్ని ఆమె కవ్వించిన మాట వాస్తవం. ఫ్యాన్స్ చేసింది ముమ్మాటికీ తప్పే అయినా.. మీరా వాళ్లను రెచ్చగొట్టిన తీరు చూస్తే లైమ్ లైట్లో లేని ఆమె అటెన్షన్ కోసం ఇలా చేసిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.