ఎన్పీఆర్‌ నమోదులో.. పుట్టిన తేదీలను అలా నిర్ధారిస్తారట..!

By అంజి  Published on  7 March 2020 8:08 AM GMT
ఎన్పీఆర్‌ నమోదులో.. పుట్టిన తేదీలను అలా నిర్ధారిస్తారట..!

ముఖ్యాంశాలు

  • ఇంగ్లిష్‌ క్యాలెండర్‌ ప్రకారం పుట్టిన రోజుల నిర్దారణ
  • ప్రతి ఒక్కరికి సీరియల్‌ నంబర్‌
  • ఎన్పీఆర్‌లో యాచకులు, వలసజీవుల పేర్లు కూడా..

హైదరాబాద్‌: 'బతికున్నా.. లేకున్నా పేర్లు రాయాల్సిందే' అంటూ సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం మేరకు.. జాతీయ పౌర పట్టికను తయారు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య జనగణనతో పాటు.. ఎన్పీఆర్‌ను అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద ప్రభుత్వం సూచించింది. జన్మించిన సంవత్సరం, నెల, తేదీని గుర్తుకు లేకపోతే.. వాటిని ఇప్పుడు ఎన్యూమరేటర్లు నిర్ధారించనున్నారు.

మన దేశంలోని చాలా గ్రామాల్లో వృద్ధులు, చదువుకోలేని వారు ఉన్నారు. అయితే వారికి తమ పుట్టిన తేదీలు సరిగ్గా తెలిసి ఉండవు. చిన్నప్పుడు తల్లిదండ్రులు వారి పుట్టిన తేదీలను ఎక్కడ కూడా నమోదు చేయలేదని సమాచారం. అయితే వారి పుట్టిన తేదీని నిర్థారించేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎన్పీఆర్‌ నమోదు చేయడానికి వచ్చే ఎన్యూమరేటర్లు.. పుట్టిన తేదీని నిర్దారించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తారు. వారి పుట్టిన తేదీని గుర్తించేందుకు.. అప్పుడు జరిగిన పండుగలను, సంఘటలను ఆధారం చేసుకోనున్నారు. వర్షకాలంలో పుట్టారా? ఎండాకాలం పుట్టారా? లేదా వారు పుట్టినప్పుడు ఏవైనా వింత సంఘటనలు జరిగితే వాటి ఆధారంగా పుట్టిన తేదీని నిర్దారిస్తారు. లేదంటే వారి కుటుంబ సభ్యుల వివరాలను, వారి శారీరక పరిస్థితుల ఆధారంగా జన్మించిన తేదీని ఖరారు చేస్తారు. ఎన్పీఆర్‌లో ప్రతి ఒక్కరి మూలాలు వెలుగులోకి రానున్నాయి. ఎన్పీఆర్‌ తల్లిదండ్రులు పేరు, వారి ఎక్కడి వారు, ఇంట్లో ఉంటున్నారా లేదా వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారా.. ఇలా అన్ని వివరాలను నమోదు చేయనున్నారు. అయితే ఇళ్లు లేని వారి జాబితాను కూడా రూపొందించనున్నారు.

ఎన్పీఆర్‌ తయారీలో భాగంగా ప్రతి కుటుంబానికి తాత్కాలిక ధ్రువీకరణ సంఖ్యను కేటాయిస్తారు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాలాకు కోడ్‌ నంబర్లు ఉంటాయి. అలాగే ఇంటి అడ్రస్‌ను సరిచూస్తారు. ఇందులో పిన్‌కోడ్‌ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులకు సీరియల్‌ నంబర్‌ కేటాయిస్తారు. దీంతో పాటు ఆ కుటుంబంలోని వ్యక్తులు ఇంట్లోనే ఉంటున్నారా లేదా.. ఎక్కడ ఉంటున్నారన్న విషయాలను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల పుట్టిన రోజులను ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం నమోదు చేస్తారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎక్కడ పుట్టారనే విషయాన్ని విడివిడిగా నమోదు చేసి.. అప్పుడు ఆ వ్యక్తిని భారతీయుడా.. కాదా అని నిర్దారిస్తారు. కోడ్‌ ఆధారంగా పాస్‌పోర్టు నంబర్‌, విద్యార్హతలు, వృత్తి, మాతృభాషలను నమోదు చేస్తారు. లభ్యతను బట్టి ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్లను ఎన్యూమరేటర్‌ సేకరిస్తారు.

Next Story