అద్వానీ, జోషిలకు అందని అయోధ్య ఆహ్వానం..!
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2020 11:20 AM GMTకోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. శ్రీరాముడు జన్మస్థానంగా బావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబువుతోంది. భూమి పూజ కోసం చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని సహా మొత్తం 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరెవరుహాజరవుతారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది.
రామ మందిరం అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే పేర్లలో మొదటి వరుసలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిరం కట్టాలన్న డిమాండ్‌తో 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర బీజేపీని మరింత ఎత్తున నిలబెట్టాయి. అయితే, భూమి పూజకు బీజేపీ కురువృద్దులైన లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఉమాభారతి కల్యాణ్ సింగ్‌కు మాత్రం ఆహ్వానాలు అందాయి.
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీరిని ఇటీవలే సీబీఐ కోర్టు ప్రశ్నించింది. అద్వానీని నాలుగు గంటలపాటు కోర్టు ప్రశ్నించడం విశేషం. అటు మురళీ మనోహర్ జోషిని కూడా సీబీఐ న్యాయస్థానం ప్రశ్నించింది. వీరు ఇచ్చిన ఉద్రేకపూరితమైన స్పీచ్ ల వలన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై అద్వానీని సీబీఐ కోర్టు ప్రశ్నించినట్టు అద్వానీ తరపు లాయర్ మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో వయసు రీత్యా అద్వానీ, జోషిలను నేరుగా ఈ సమావేశానికి ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి ఇరువురు హాజరుకానున్నట్లు సమాచారం.