రాష్ట్రంలో ఒక్కరికీ కరోనా లేదు.. మంత్రి ఈటల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2020 3:15 PM GMT
రాష్ట్రంలో ఒక్కరికీ కరోనా లేదు.. మంత్రి ఈటల

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరికీ కరోనా వైరస్ లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌తో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పూర్తిగా కోలుకున్నాడన్నారు. అతడికి రెండు టెస్ట్‌లు నిర్వహించగా.. రెండింటిలోనూ కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా విషయంలో ఎవరూ భయపడవద్దని ప్రజలకు సూచించారు. కరోనా తీవ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, దీనికి ప్రత్యేకంగా చికిత్స అందుబాటులోకి రాలేదని తెలిపారు.

కరోనా నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనాపై గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు. కొత్తగా మరో మూడు ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి వచ్చిందని తెలిపారు. వరంగల్‌ ఎంజీఎం, ఐపీఎం హైదరాబాద్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయన్నారు. ఈ ఐదు ఆస్పత్రుల్లోనూ అవసరమైన సిబ్బంది, కిట్స్‌ సరఫరా చేశామన్నారు. పూర్వ 9 జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు, ఐసీయూలు సిద్ధం చేశామని తెలిపారు.

కరోనా రోగుల కోసం ఎఫ్‌ఆర్‌ ఫిల్టర్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఫలితంగా రోగులు వదిలిన గాలి శుద్ధి అవుతుందని చెప్పారు. వైరల్‌ జ్వరాలు వచ్చినవారికి ఎలాంటి మందులను ఇస్తున్నామో కరోనా వచ్చిన వారికి కూడా అవే మెడిసిన్స్‌ ఇస్తున్నామని తెలిపారు. కాగా.. ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళను ఎయిర్‌పోర్టులో ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు.

Next Story