క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న 'నిజామాబాద్ కార్పొరేషన్' ఫలితం..!
By అంజి Published on 25 Jan 2020 10:38 AM GMT
మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కారు దూసుకుపోతోంది. దాదాపుగా అన్ని చోట్ల మేయర్ పీఠాలు అధికార టీఆర్‌ఎస్ పార్టీకే దక్కే సూచనలు కనిపిస్తుండగా.. నిజామాబాద్ లో మాత్రం ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇప్పటివరకు 47 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. మరో 13 డివిజన్ల ఫలితాలు సాయంత్రానికి రానున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలలో టీఆర్‌ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించగా.. మిత్రపక్షమైన ఎంఐఎం కూడా 13 స్థానాల్లో విజయం సాదించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించింది ముందంజలో ఉంది. ఇక్కడ మేయర్ పీఠం దక్కాలంటే 31 స్థానాల్లో గెలుపొందాలి. అయితే.. మొత్తం ఫలితాలు వెలువడక ముందే టీఆర్‌ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకోసం మిత్రపక్షం ఎంఐఎంతో జతకట్టి గెలవాలని భావిస్తోంది. మిగిలిన 13 స్థానాల్లో మరో 6 స్థానాలు దక్కించుకుంటే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ కు దక్కుంది. అలా కాకుండా బీజేపీ మరో 10 స్థానాల్లో గెలిస్తే బీజేపీకు దక్కనుంది.
రాష్ట్రంలో మాత్రం కారు అందనంత స్పీడుగా దూసుకుపోతోంది. ఎన్నికలు ఎవైనా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దే అన్నట్లు మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురు లేకుండాపోయింది. టీఆర్‌ఎస్ ఘన విజయంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అయితే నిజామాబాద్‌లో మాత్రం టీఆర్‌ఎస్‌కు బీజేపీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ తన సత్తా చాటుతోంది. నిజామాబాద్‌లో బీజేపీ సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే సూచనలు కనబడుతున్నాయి.