రేవంత్‌రెడ్డికి షాకిచ్చిన టీఆర్‌ఎస్
By సుభాష్ Published on 25 Jan 2020 10:05 AM GMTతెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ హవా జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్ దూసుకెళ్లింది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో కారు ధాటికి కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా, 8 వార్డుల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలు రేవంత్ రెడ్డికి ఓ రకంగా పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.
కొడంగల్ గెలుపు బాధ్యతలు స్వయంగా రేవంత్ రెడ్డి భుజాన వేసుకుని విస్తృత ప్రచారం చేశారు. నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. కొడంగల్ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఇక కొడంగల్ తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిపై కన్నేశాడు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. అదే జోష్‌లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తాచాటాలని చూసిన రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.