పొంచి ఉన్న మరో ముప్పు.. ఈ ఏడాదిలో ఇది ఐదవది..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 3:12 PM GMT
పొంచి ఉన్న మరో ముప్పు.. ఈ ఏడాదిలో ఇది ఐదవది..

భారత్ వైపుకు మరో ముప్పు దూసుకొస్తోంది. తాజాగా వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గోవాలోని పాంజిమ్ కు నైరుతి దిశగా 370 కిలోమీటర్ల దూరంలో, ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 690 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్ లోని సూరత్ కు దక్షిణ నైరుతి దిశగా920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారానికి ఈ అల్పపీడనం వాయుగుండంగా..ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు నిసర్గ అనే శాస్త్రీయనామం పెట్టారు.

కాగా..వారంరోజుల క్రితమే సూపర్ సైక్లోన్ అంఫన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా లలో తీవ్ర ప్రభావం చూపింది. వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయి చాలా మంది నిరాశ్రయులయ్యారు. తీరప్రాంతాల ప్రజలను ముందుగా సురక్షిత కేంద్రాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. ఇంకా అలాంటి పరిస్థితి నుంచి ఆయా రాష్ట్రాలు కోలుకోకుండానే మరొక తుఫాను వస్తుందని హెచ్చరికలు రావడంతో ప్రజలకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతానికి ఈ తుఫాన్ ప్రభావం గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ తుఫాను తన దిశను ఏ రాష్ట్రం వైపు మార్చుకుంటుందో తెలియదంటున్నారు అధికారులు.

ఓ వైపు కేరళను నైరుతి రుతుపవనాలు తాకనుండటం, మరోవైపు తుఫానుతో తెలంగాణలో కూడా రానున్న మూడ్రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో ఇది 5వ ముప్పు..

భారత్ కు 2020 సంవత్సరం అస్సలు కలిసిరాలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఇది 5వ ముప్పుగా చెప్తున్నారు నిపుణులు. మొదట కరోనా వైరస్. సుమారు నాలుగు నెలల నుంచి యావత్ దేశం కరోనాతో పోరాడుతోంది. ఆ తర్వాత విశాఖ స్టైరైన్ గ్యాస్ లీకేజీ, అంఫన్ తుఫాను, ఇటీవల వచ్చిన ముప్పు మిడతల దండు దండయాత్ర. ఇప్పటికే రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ దండు పంటలను తినేస్తున్నాయి. ఇప్పుడు నిసర్గ తుఫాన్. ఇలా ఎవరో పగబట్టినట్లుగానే ఒక్కో విపత్తు దేశంపై విరుచుకుపడుతున్నాయి. అన్నీ దేశంపై ప్రభావం చూపకపోయినా..ఒక్కొక్కటి ఒక్కో రాష్ట్రాన్ని మళ్లీ తేరుకోలేని విధంగా చేస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా రోజూ వందల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సుమారు 500 కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it