క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో దేశ వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి నెల‌లో జ‌ర‌గాల్సిన రాజ్య‌స‌భ్య ఎన్నిక‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వాయిదా ప‌డిన 18 రాజ్య‌స‌భ స్థానాల‌కు జూన్ 19న ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను ఖ‌రారు చేసింది.

జూన్ 19న ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలిపింది. ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది. అయితే ఎన్నికలు నిర్వహించే సమయంలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల సంఘం సూచించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం నాలుగు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వైసీపీ నుంచి న‌లుగురు, టీడీపీ నుంచి ఒక‌రు బ‌రిలోకి ఉన్నారు. గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, ఝార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానాలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 55 ఖాళీల్లో ఇప్ప‌టికే 37 స్థానాలు ఏక‌గ్రీవం కాగా.. 18 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.