నిర్భయ దోషులు చివరి రోజు జైల్లో ఎలా గడిపారంటే..

By సుభాష్  Published on  20 March 2020 2:37 AM GMT
నిర్భయ దోషులు చివరి రోజు జైల్లో ఎలా గడిపారంటే..

2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో చోటు చేసుకున్ననిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు తీహార్‌ జైల్లో నలుగురిని ఉరి తీశారు జైలు అధికారులు. ఒకేసారి నలుగురిని ఉరితీసిన అధికారులు.. అరగంటపాటు ఉరి కంబానికి వేలాడదీశారు. 8 ఏళ్లకు దోషులకు ఉరి శిక్ష అమలు కావడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇక గురువారం జైలు అధికారులు హైలెవల్‌ సమావేశం నిర్వహించారు. అలాగే చివరి రోజు దోషుల ప్రవర్తనపై జైలు సిబ్బంది ఎప్పటికప్పుడు గమనించారు. జైలు అధికారుల సమాచారం ప్రకారం.. ఉరికి ఒక రోజు ముందు దోషులు జైల్లో టెన్షన్‌ టెన్షన్‌గా గడిపారు. అంతేకాదు ఉరికి ముందు నలుగురు దోషులు కూడా తమ తమ సెల్‌లో విశ్రాంతిలేకుండా గడిపారట. వారిలో భయం కనిపించింది.

దోషుల్లో వినయ్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌లు గురువారం రాత్రి భోజనం చేశారు. ఇక పవన్‌ గుప్తా అక్షయ్‌లు మాత్రం భోజనం చేయడానికి నిరాకరించారు. తెల్లవారితే ఉరి ఉంటుందని తెలిసి వారి ముఖాల్లో భయం, ఆందోళనగా కనిపించింది. గత 24 గంటల పాటు నలుగురి కదలికలను గమనించడానికి 15 మందిని నియమించారు. ఇక జైలు నిబంధనల ప్రకారం నలుగురు దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి చివరి కోరికను అడుగగా, నలుగరు కూడా మౌనం వహించారట. ఉదయం 4 గంటలకు అల్పహారం అందించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

మృతదేహాల అప్పగింత

ఇక దోషుల మృతదేహాలను దీన్‌ దయాళల్‌ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత నలుగురి మృతదేహాలను వారివారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఒక వేళ కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరిస్తే జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలాగే దోషులు జైల్లో ఉన్నంత కాలం పనులు చేసి సంపాదించిన డబ్బునువారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

Next Story