ఉరిశిక్షకు రెడీ.. ఓ నిందితున్ని తీహార్ జైలుకు తరలింపు
By సుభాష్
ముఖ్యాంశాలు
- నిర్భయ నిందితుల ఉరిశిక్షకు ఏర్పాట్లు
- ఉరితాళ్లను సిద్ధం చేస్తున్న బక్సర్ సెంట్రల్ జైలు ఖైదీలు
- ఒక దోషిని తీహార్ జైలుకు తరలింపు
గత ఏడేళ్ల కిందట ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు త్వరలో ఉరి శిక్షపడనుంది.ఈ నేపథ్యంలో వారికి ఉరి తీసేందుకు బీహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు ఖైదీలో ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నారు. నిర్భయ కేసులో నిందితుడైన పవన్ కుమార్ గుప్తా అనే దోషి మండోలీ జైలులో ఉన్నాడు. ఈ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరిశిక్ష వేయనున్న నేపథ్యంలో మండోలీ జైలునుంచి పవన్ కుమార్ గుప్తాను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.
ఈ కేసులో ఇతర నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్‌లు తీహార్ జైలులోనే ఉన్నారు. మండోలీ జైల్లో ఉన్న నిర్భయ దోషి పవన్ కుమార్ ను అత్యంత భద్రత మధ్య తీహార్ లోని రెండో నంబరు జైలు గదికి తీసుకువచ్చారు. నిందితుల్లో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించాక 14 రోజులకు వారిని ఉరి తీయనున్నారు. ఈ 14 రోజుల సమయంలో కోర్టు డెత్ వారంట్ జారీ చేయనుంది.
త్వరగా ఉరి తీయాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోచన:
రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ అనంతరం 14 రోజుల సమయాన్ని తగ్గించి త్వరగా ఉరి తీసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిర్భయ కేసులో నిందితుడైన అక్షయ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో సోమవారం రివ్యూ పిటిషన్ సమర్పించారు. ఈ కేసులో నిందితులైన వినయ్ కుమార్, ముకేష్ సింగ్, పవన్ గుప్తాలు కూడా గతంలో రివ్యూపిటిషన్ వేసినా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. 2012 డిసెంరు 16వతేదీన జరిగిన నిర్భయ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా, వారిలో ఒకరు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంమీద నిర్భయ కేసులో దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్, పవన్ కుమార్ గుప్తాలను ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.