మరో దారుణం... మైనర్‌ యువతిపై రెండు సార్లు గ్యాంగ్‌రేప్‌

By Newsmeter.Network  Published on  7 Dec 2019 3:25 PM GMT
మరో దారుణం... మైనర్‌ యువతిపై రెండు సార్లు గ్యాంగ్‌రేప్‌

దేశంలో అఘాయిత్యాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కామాంధుల ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్‌లో దిశ ఘటన మరువకముందు మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. హర్యానాకు చెందిన మైనర్‌ యువతిపై నలుగురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. అంతే కాదు.. ఈ యువతిపై ఐదు నెలల వ్యవధిలో రెండు సార్లు అత్యాచారం జరిపారు.

వివరాల్లోకి వెళితే... పాల్వాల్‌ జిల్లాలో 17 సంవత్సరాల యువతిని డిసెంబర్‌ 4న నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి 4వ తేదీ రాత్రి ఇంటి ముందు నుంచి వెళ్తుండగా, నలుగురు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులంతా బాధితురాలి ఊరికి చెందినవారే కావడం గమనార్హం.

అదే యువతిపై ఐదు నెలల క్రితం...

ఆ యువతిపై ఇదే నిందితులు గత ఆగస్టు 13వ తేదీన కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గ్రామ పెద్దలు మధ్య పంచాయితీ ఏర్పాటు చేసి సర్దిచెప్పడంతో బాధితురాలు కేసును ఉపసంహరించుకుంది.

ఇదే అదునుగా భావించిన ఈ మృగాళ్లు సదరు బాధితురాలిని డిసెంబర్ 4న కూడా మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమెన్‌ పోలీస్‌స్టేషన్‌ ఇంఛార్జ్ హీరా మణి సమక్షంలో బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it