విడాకులు కోరిన నిర్భయ దోషి భార్య..
By అంజి Published on 18 March 2020 11:19 AM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిని అమలు చేసే సమయం దగ్గర పడుతుండటంతో ఆ ఉరిని ఆపేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి.
ఉరి నుంచి తప్పించుకునే అన్ని మార్గాలు మూసుకుపోగా.. ఉరిని ఆలస్యం చేసుకునేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా ఈ నెల 20వ తేదీన నిర్భయ దోషుల ఉరికి ఢిల్లీ కోర్టు వారెంట్లు జారీ చేయగా.. ఈ క్రమంలోనే నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనం అయ్యింది.
Also Read: కరోనా సెలవులు తమకు వర్తించవు.. ప్రభుత్వం చెబితే నేను వినాలా.?
తన భర్త నిర్దోషి అని, కానీ అతడిని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించారని, అత్యాచారం కేసులో ఉరి వెయ్యబోతున్న వ్యక్తికి భార్యగా ఉండదలుచుకోలేదంటూ ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది ఆమె ఈ వ్యవహారంలో పునీత భర్త అక్షయ్ కుమార్ సింగ్‌కు కోర్టు నోటీసులు పంపాల్సి ఉంటుంది. ఈ విడాకుల కేసులో తీర్పు వచ్చేవరకు వారికి ఉరి వాయిదా పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు న్యాయ నిపుణులు. అక్షయ్ కుమార్ సింగ్ భార్య వేసిన పిటిషన్ మార్చి 19వ తేదీన విచారణకు రానుంది. ఇన్ని సంవత్సరాల తరువాత విడాకుల పిటిషన్ దాఖలు చెయ్యడం ఉరిని మరింత ఆలస్యం చేయడానికే అన్నది కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం.
Also Read: దిగ్విజయ్‌సింగ్‌ను అడ్డుకున్న కర్నాటక పోలీసులు..
మరోవైపు తనకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని నిర్భయ దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లో.. డిసెంబర్ 17, 2012న ముకేశ్ సింగ్‌ను రాజస్థాన్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకొచ్చారని పేర్కొన్నారు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన రోజు అతడు ఢిల్లీలోనే లేడని వాదించడం గమనార్హం. ఉరి అమలును ఆలస్యం చేయడం కోసం ముకేశ్ ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ముకేశ్‌ను తీహార్ జైల్లో చిత్ర హింసలకు గురి చేశారని కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నిర్భయ దోషులకు మూడుసార్లు ఉరి అమలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 5న చివరిసారిగా డెత్ వారంట్ జారీ చేసిన కోర్టు.. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను తిహార్ జైల్లో ఉరి తీయాలని ఆదేశించింది.