ఏపీ రాజకీయాల్లో రచ్చ పుట్టిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ

By సుభాష్  Published on  24 Jun 2020 6:20 AM GMT
ఏపీ రాజకీయాల్లో రచ్చ పుట్టిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ

ఏపీ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంలో మరోసారి వివాదస్పదంగా మారింది. బీజేపీ నేతలు ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో నిమ్మగడ్డ భేటీ వీడియోలు బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చ రచ్చ జరుగుతోంది. ముందే నిమ్మగడ్డపై పై ఏపీలో పెద్ద రచ్చ జరుగుతుంటే.. ఈ వ్యవహారం జగన్‌ సర్కార్‌కు మరో ఆయుధంగా లభించినట్లయింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలకు సంబంధించిన వీడియో వెలుగు చూడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ హోటల్లో నిమ్మగడ్డ, సుజనా, కామినేనిలు ఉదయం 10:40 గంటలకు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు వీరి భేటీ జరిగింది. హోటల్‌లో ఈ ముగ్గురికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపు వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు కూడా విడివిడిగా హోటల్‌కు రావడం, ఒకే వ్యక్తి ముగ్గురిని హోటల్‌లో రిసీవ్‌ చేసుకోవడం, ఒకే గదిలో భేటీ కావడం అనుమానస్పదంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఓ ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ప్రోటోకాల్‌ను కాదని రాజకీయ నేతలతో హోటల్‌లో సమావేశం కావడం వెనుక ఆంతర్యమేమిటని, దీనిపై నిజనిజాలు బయటపడాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది.

ఏపీ ప్రభుత్వానికి.. నిమ్మగడ్డకు మధ్యం జరిగిందేంటి..?

కాగా, ఇటీవల ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది. ఇక కరోనా వైరస్‌ కారణంగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికలను రద్దు చేయడంతో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమను సంప్రదించకుండా ఎన్నికలను రద్దు చేయడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. ఆర్డినెన్స్‌ ద్వారా నిమ్మగడ్డను తొలగించి ఆ స్థానంలో మరో వ్యక్తికి కూర్చోబెట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే తనను తొలగింపును సవాలు చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం .. నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసి సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ టీడీపీ మనిషి అని.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా కమ్మ సామాజిక వర్గ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సహా వైసీపీ నేతలంతా ఆరోపణలు గుప్పించారు.

రంగంలోకి దిగిన కమలం నేతలు!

కమలం నేతలతో నిమ్మగడ్డ రమేష్‌ రహస్యంగా భేటీ కావడం వివాదస్పందంగా మారడంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. హోటల్‌లో అంత రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ పెద్దలు ఇరువురిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ వ్యవహారంపై బహిరంగంగా పోరాటం చేయమని చెప్పింది కానీ.. ఇలా కుట్రలు చేయమని కాదని అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరైంది కాదని బీజేపీ అధిష్టానం హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్ద మీద ఈ ముగ్గురి భేటీ తెలుగు రాష్ట్రంలో హట్‌ టాపిక్‌గా మారింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.



Next Story