సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణ.. స్టేకు నిరాకరణ
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 2:47 PM ISTఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రమేష్ కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగ పదవులతో ఆటలాడుకోవద్దు అని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఆర్డినెన్స్ తీసుకురావడంలో ప్రభుత్వానికి మంచి ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయని ధర్మాసనం సంతృప్తి చెందడం లేదని పేర్కొంది. ఇదే సమయంలో ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీంతో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఊరట లభించినట్టు అయ్యింది.
అంతకముందు ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఎన్నికల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి విరుద్దంగా కనిపిస్తోందన్నారు. ఓ వైపు నిబంధనలన్నీ కొట్టి వేస్తూనే అవే నిబంధనల ప్రకారం రమేశ్ కుమార్ ను ఎస్‌ఈసీగా పదవిలో కూర్చోబెట్టాలని రెండు పరస్పర విరుద్దమైన అభిప్రాయాలు వెల్లడించిందని వాదనలు వినిపించారు.
దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవన్నారు. మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కేసును రెండు వారాల పాటు వాయిదా వేశారు.