ఎన్నార్సీ, సీఏఏ ల విషయంలో ఆందోళనలు జరుగుతుడవచ్చు... ఆర్ధిక మాంద్యం దేశాన్ని ముప్పిరి గొంటూ ఉండవచ్చు. ధరలు పెరుగుతూ ఉండవచ్చు. రాష్ట్రాల ప్రభుత్వాలు తిరుగుబాట్లు చేస్తూ ఉండవచ్చు. పలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతూ ఉండవచ్చు. కానీ భారత దేశపు ఓటర్లు ఇప్పటికీ ప్రధానమంత్రిగా మాత్రం నరేంద్ర మోదీయే కావాలని కోరుకుంటున్నారు. ఇదే విషయం ఇండియా టుడే గ్రూప్‌-కార్వీ ఇన్‌సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (ఎంఓటీఎన్‌) తాజా సర్వేలో వెల్లడైంది.

తదుపరి ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారని వేసిన ప్రశ్నకు అత్యధికులు “మోదీ మోదీ” అని అరిచి మరీ చెప్పారు. దేశంలో నెక్స్ట్ పీఎం మోదీయేనని 53 శాతం మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రెండవ స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయనకు 13 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. అంటే ఇద్దరి మధ్యా తేడా 40 పాయింట్లన్నమాట. ఈ దూరాన్ని రాహుల్ గాంధీ అధిగమించడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఇక సోనియా గాంధీ ప్రధానిగా ఉండాలని కేవలం 7 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రియాంకా వాద్రా కావాలని మూడు శాతం మందే కోరుకున్నారు. ఇవన్నీ కలిపినా ఇరవై శాతం మాత్రమే అవుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హోంమంత్రి అమిత్ షా దేశానికి ప్రధానమంత్రి కావాలని భావిస్తున్న వారుకేవలం నాలుగు శాతమే. ఇంకో గమనార్హమైన విషయం ఏమిటంటే 60 శాతం మంది హిందువులు, 17 శాతం ముస్లింలు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పది శాతం హిందువులు, 32 శాతం ముస్లింలు కోరుకుంటున్నారు. ఇక పశ్చిమ భారతదేశం అంటే గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతంలో 66 శాతం మంది మోదీని కోరుకుంటూంటే, కేవలం 6 శాతం మాత్రమే రాహుల్ బాబాకు ఓటేస్తున్నారు.

ఈ సర్వేలో భాగంగా దేశంలోని 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,141 మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సర్వేనిర్వహణలో కార్వీ ఇన్‌సైట్స్‌ ఇండియా టుడేతో కలిసి పనిచేసింది.

సుభాష్

.

Next Story