న్యూస్‌ మీటర్‌ కథనంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Feb 2020 3:16 PM GMT
న్యూస్‌ మీటర్‌ కథనంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లేడీస్ హాస్టల్ ముందు కొద్ది నెలల క్రితం ఓ పోలీసు పాడు పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వీడియో మరోసారి వైరల్ అయింది. తాము షీ టీమ్ కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని అమ్మాయిలు వాపోయారు. మీడియాతో కూడా ఇదే విషయాన్ని చెప్పుకొని బాధపడ్డారు. ఇది నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ వరకూ వెళ్లింది. దీంతో నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ ట్విట్టర్ వేదికగా "ఇలాంటి ఘటనపై రాచకొండ షీ టీమ్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం శోచనీయం.. విద్యార్థినుల సమస్య పరిష్కరించని సదరు పోలీస్ స్టేషన్ పై చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరతామని" ట్వీట్ చేశారు.ఈ ఘటన చోటుచేసుకొని నాలుగు నెలలు అయినా పోలీసులు పట్టించుకోలేదని నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ ట్వీట్ చేయడంతో అయినా పోలీసుల్లో కదలిక వస్తుందని తాము ఆశిస్తున్నామని విద్యార్థినులు న్యూస్ మీటర్ కు చెప్పుకొచ్చారు. ట్వీట్ చేయడమే కాకుండా ఈ సమస్య మీద అధికారులతో నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ చర్చించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నాను. ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని.. ఆడవారికి కనీస రక్షణ కల్పించాలని ఆకాంక్షింస్తున్నారు.

ఇంతకూ ఏమి జరిగింది.. వీడియో ఎలా వైరల్ అయింది

ఆ పోలీసు పట్టపగలు నడిరోడ్డులో కామంతో రెచ్చిపోయాడు. అమ్మాయిల హాస్టల్ ముందు.. అమ్మాయిలను చూసుకుంటూ చేయకూడని పని చేశాడు. అతడు చేస్తున్న నీచపు పనిని గుర్తించిన అమ్మాయిలు అతడిని వీడియో చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇంతలో అతడు వారిని గమనించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఖాకీ ప్యాంటు వేసుకుని ఉన్న అతడు తన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ బైక్ కు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో గుర్తించడం కూడా కష్టమైంది. ఈ ఘటన తుర్క్యామంజిల్ లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్(TISS) గర్ల్స్ హాస్టల్ ముందు చోటుచేసుకుంది.

అక్టోబర్ 20, 2019న చోటుచేసుకుంది ఈ ఘటన. కానీ జనవరి 31, 2020న మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఘటన గురించి పలువురు ఆరా తీస్తున్నారు. ఓ అమ్మాయి హాస్టల్ దగ్గరే ఉన్న కిరాణా అంగడికి వెళుతూ ఉండగా.. అతడు ఇలా పాడు పని చేస్తూ కనిపించాడు. ఆ అమ్మాయి తన స్నేహితురాలి పేరును పిలవగానే అక్కడి నుండి బైక్ లో పారిపోయాడు.

ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్ష్యులు న్యూస్ మీటర్ తో మాట్లాడారు. 'తమను చూసి ఆ వ్యక్తి పాడుపని చేస్తూ నిలబడ్డాడని.. తాము అతన్ని గమనించి అరవడం మొదలుపెట్టగానే అక్కడి నుండి పారిపోయాడు' అని ఓ అమ్మాయి చెప్పుకొచ్చింది. అతడు ఖాకీ రంగు ప్యాంట్ ధరించాడని, షూలు కూడా వేసుకున్నాడని వీడియోలు చూస్తే అర్థం అవుతోంది. నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకుందామనుకుంటే దాని మీద ఎటువంటి నంబర్స్ లేవని మరో అమ్మాయి చెప్పింది. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు కావస్తున్నా ఆ వ్యక్తిని పోలీసులు ట్రేస్ చేయలేదని మరో అమ్మాయి చెప్పుకొచ్చింది. 'షీ'-టీమ్ స్పందిస్తుందని తాము భావించామని కానీ వారి నుండి ఎటువంటి స్పందన లేదన్నారు.. ఇబ్రహీం పట్నం షీ టీమ్ కు తాము తమ దగ్గర ఉన్న సమాచారంతో పాటూ.. ఈ వీడియోను కూడా ఇచ్చామని అతన్ని ఇప్పటి వరకూ పోలీసులు పట్టుకోలేదని అమ్మాయిలు న్యూస్ మీటర్ తో చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ చేసిన ట్వీట్ ద్వారా పోలీసుల్లో చలనం వస్తుందేమో చూడాలి.

Next Story