గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారెటు.?
Telangana Governor Tamilisai Soundararajan. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన
By న్యూస్‌మీటర్ తెలుగు
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై బహిరంగంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ కు పెద్దగా దోస్తీ లేని సంగతి తెలిసిందే. ఇక గవర్నర్ తమిళిసై తో టీఆర్ఎస్ అగ్ర నాయకులు చాలా కాలంగా దూరంగానే ఉన్నారు. గవర్నర్ తో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. బీజేపీతో గవర్నర్ సంబంధాలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొన్ని ట్వీట్లను చేశారు. చెన్నైకి చెందిన ఎన్‌డిటివి జర్నలిస్ట్, తమిళనాడు బీజేపీ పిఆర్‌ఓ (ఫంక్షనరీ) తెలంగాణ గవర్నర్‌కు పిఆర్‌మెన్‌గా రహస్యంగా పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు.
అయితే, గవర్నర్ కార్యాలయానికి చెందిన ప్రెస్ సెక్రటరీ.. అధికారిక ప్రకటన ద్వారా ఈ ఆరోపణలను ఖండించారు. గవర్నర్ భారత రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తున్నారని తెలిపారు. ''తెలంగాణ గవర్నర్ పీఆర్వోగా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని నియమించినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలో ఎలాంటి వాస్తవాలు లేవు. ఇది పూర్తిగా నిరాధారం. గవర్నర్ కు గతంలో ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఇలాంటి వ్యక్తిని నియమించలేదు. ప్రస్తుతం కూడా గవర్నర్ కార్యాలయంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన వారెవరూ పని చేయడం లేదు. ఈ వార్తలను స్వార్థ ప్రయోజనాలతో కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాజ్‌భవన్ రాజకీయంగా తటస్థంగా ఉంది'' అని ఓ అధికారిక ప్రకటన వచ్చింది. అయితే.. గవర్నర్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుండి వచ్చిన స్క్రీన్‌షాట్‌లు తమిళనాడులో, ఇతర చోట్ల బీజేపీ కార్యకలాపాలకు డాక్టర్ తమిళిసై మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గవర్నర్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు కూడా వివాదాలకు కేంద్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే..!
గవర్నర్ కార్యాలయంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలి వ్యక్తి తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. 1984లో జరిగిన ఆగస్టు సంక్షోభం సమయంలో ఆయనను గవర్నర్ రామ్ లాల్ తొలగించారు. అప్పుడు జరిగిన రాజకీయ సంక్షోభం గురించి తెలుగు ప్రజలు ఎవరూ మరచిపోరు. ఇక అప్పట్లో కొత్తగా వచ్చిన గవర్నర్ కుముద్‌బెన్ జోషి, ఎన్టీఆర్‌ల మధ్య జరిగిన సంఘటనలు కూడా.. ఎన్నో రాజ్యాంగ సంబంధమైన ప్రశ్నలను రేకెత్తించింది.. ఇప్పటికీ వాటికి సమాధానం లభించలేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా నియమించబడిన గవర్నర్లు ఆయా రాష్ట్రాలలో స్థానిక రాజకీయాలతో చాలాసార్లు చెలగాటమాడడానికి ప్రయత్నించారు. ఇప్పుడు లోక్‌సభలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా అదే పని చేస్తోందా అనే సందేహాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి.
డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. "గవర్నర్ విధి రాజకీయ స్వభావం కలిగి ఉంటుంది. గవర్నర్ లకు కేటాయించిన బాధ్యతలతో పాటు.. అభివృద్ధి చేయాలని కూడా ఆశిస్తారు" అని చెప్పుకొచ్చారు. మర్రి చెన్నా రెడ్డి తమిళనాడు గవర్నర్ గా ఉన్న సమయంలో.. జయలలితతో పెద్ద వివాదమే నడిచింది.
1995లో అప్పటి గవర్నర్ క్రిషన్ కాంత్ (తరువాత భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు) పాత్రను పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు తీవ్రంగా ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఈఎస్‌ఎల్ నర్సింహన్ ను 'తెలంగాణ వ్యతిరేక' వ్యక్తిగా అభివర్ణించాయి టీఆర్‌ఎస్ శ్రేణులు. అయితే ఆ తర్వాత నరసింహన్ తెలివిగా అడుగులు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తో రాజనీతిజ్ఞతను కనబరిచారు. ఆ తర్వాత ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వలేదు. బేగంపేట విమానాశ్రయంలో నర్సింహన్ దంపతులకు కేసీఆర్ ఆయన అనుయాయులు భావోద్వేగంతో వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వచ్చిన తమిళిసై తో మాత్రం కేసీఆర్ కాస్త దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ తమిళిసై, కేసీఆర్ మధ్య స్నేహబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇటీవలి గణతంత్ర దినోత్సవం వంటి వేడుకల్లో కూడా ముఖ్యమంత్రి- గవర్నర్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని స్పష్టంగా తెలిసిపోయింది. ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య పెరుగుతున్న అగాధాన్ని బట్టబయలు చేసింది. బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం విషయంలో కూడా ఎంతో రచ్చ చోటుచేసుకుంది.
టీఆర్ఎస్ నేతలు ఇటీవల కూడా గవర్నర్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే..! టీఆర్‌ఎస్ సీనియర్ నేతల వ్యాఖ్యలను తమిళిసై పెద్దగా పట్టించుకున్నట్లు కూడా లేరు. డాక్టర్ తమిళిసై తన రాజ్యాంగ బాధ్యతలను ఎవరికీ భయపడకుండా నిర్వర్తిస్తూ వెళుతున్నారు. ఎవరికీ ఫేవర్ గా కూడా లేరు. రాజ్యాంగ కార్యాలయాల బాధ్యత దేశం పాలనా స్ఫూర్తిని మార్గనిర్దేశం చేయడానికి నిర్వచించబడింది. రాజ్యాంగానికి కట్టుబడి.. స్ఫూర్తిని పొందుపరచడం ద్వారా ఉన్నత పదవులలోని వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రశంసలను అందుకుంటూనే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.