తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి ద్రోహన్ని క్షమించని జర్నలిస్ట్ కె ఎల్ రెడ్డి
Journalist KL Reddy who did not forgive Chenna Reddy's betrayal in the Telangana movement. 1980 జనవరిలో ‘వరంగల్ వాణి’ అనే మా నాన్నగారు, ఎడిటర్ ఎం ఎస్ ఆచార్య దినపత్రిక నడిపేవారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2022 3:37 PM IST1980 జనవరిలో 'వరంగల్ వాణి' అనే మా నాన్నగారు, ఎడిటర్ ఎం ఎస్ ఆచార్య దినపత్రిక నడిపేవారు. అంతకుముందు జనధర్మ పేరుతో 1958 నుంచి పత్రిక నడిపేవారు. 1971 సెప్టెంబర్ 23 నాటి తొలి పేజీనాడు, తరువాత సంపాదకీయం నాడు రాసిన పేజీ మీ ముందుంది. ఒక సారి చదవండి దీన్ని. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో దేవులపల్లి ప్రభాకరరావు సారథ్యంలో వెలువడిన 'జనత' పత్రికలో నెలకు రూ.150ల వేతనానికి కె ఎల్ రాసేవారు. 'జనత' ఆగింది. తర్వాత 'నేడు' అని కరపత్ర దినపత్రికను వచ్చేవి. మూడు నెలలపాటు పేజీ కరపత్రం, పది పైసలు పత్రిక వచ్చేది. సికిందరాబాద్ దినపత్రిక విక్రయించే ఏజెంటు మల్లయ్య ఆర్థిక సహాయం ఇచ్చేవాడు. 1969 కొన్న రోజుల్లో చెన్నారెడ్డి ఉద్యమ వార్తలతో 'నేడు' మొదటి కరపత్రంలో 'తెలంగాణ సింహకిశోరం చెన్నారెడ్డి' అంటూ రాసాడు. అదే కె ఎల్ తన చివరి కరపత్రంలో ''తెలంగాణ ద్రోహి చెన్నా'' అనే ప్రధాన శీర్షిక తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. ఆయనకు మంత్రులు, నాయకులు అవసరం లేదు. తెలంగాణ ముఖ్యం ఆయనకు. అంతకుముందు 14 స్థానాల్లో 10 లోక్ సభ స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. నాటి ప్రధాని ఇందిరాగాందీ అకస్మాత్తుగా అర్ధరాత్రి హైదరాబాద్ కు వచ్చి చొక్కారావుతోనూ, చెన్నారెడ్డితోనూ మాట్లాడింది. ముఖ్యమంత్రి పదవి నుంచి కాసు బ్రహ్మానందరెడ్డిని తీసేస్తా చాలన్నాడు, చెన్నారెడ్డి. అంతే చెన్నారెడ్డి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిపారేసారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమం చల్లారిపోయింది. కెఎల్ రెడ్డి చెన్నారెడ్డి ఈ ద్రోహాన్ని క్షమించలేదు. ప్రజా ఉద్యమానికి ఐదు వెన్ను పోట్లు అంటూ ఎం ఎస్ ఆచార్య సంపాదకీయం రాసారు. అది చాలా సంచలనం కలిగింది. ఆయన నిప్పులు చెరిగారు.
కెఎల్ కరపత్రం పేరుతో నడిచే పత్రిక చెన్నారెడ్డితో ఆగిపోవడం. హాయిగా గవర్నర్ గా చెన్నారెడ్డి ఉండేవాడు. కాని కరపత్ర 'పత్రిక' అని కె ఎల్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో నిలబెట్టారు. దిల్లీ నుంచి వార్తాపత్రికల రిజిస్ట్రార్ ఆమోదం లేకుండా పత్రికలాంటి కరపత్రం నడిపినందుకు ఓ న్యాయాధికారి రెడ్డికి నెలరోజుల కఠిన కారాగారశిక్ష విధించారు. కె ఎల్ రెడ్డిని ఒక ఖైదీ 'నువ్వు ఎవరిని చంపావు'' అని అడిగాడు. 'నేనెవ్వరినీ చంపలేదు. ఏ నేరమూ చేయలేదు'' అని చెప్పాడు. ''మరి ఏ నేరానికి జైల్లో తోసిండ్రు '' అని మరో ప్రశ్న. తెలంగాణ కోసం పత్రిక తీసినందుకు అంటే ఆశ్చర్యపోయారు. అప్పుడు ఖైదీలలో సానుభూతి, గౌరవం పెరిగింది. జైలులో ఇతర తోటి ఖైదీలు పనులు చేసేవారు. ముషీరాబాద్ లో రెడ్డి రోజూ దినపత్రికలు చదివి విశేషాలు తెలియజేసేవారు. వరసగా ప్రతి రోజూ ప్రచురిస్తే అది పత్రికగా అనడం న్యాయమే. అయితే జరిమానా ఇవ్వాల్సిన శిక్ష వేసినా సరిపోయేది. జైల్లో తోసేంత నేరం కాదు. అది పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించే అన్యాయం. కాని కోర్టులో వాదించి గెలవగలిన శక్తిలేనందున కఠిన శిక్ష విధించారు. అన్యాయంగా కె ఎల్ రెడ్డి నెలరోజులు కఠిన శిక్షతో జైలుకు వెళ్లారు.
ఇద్దరు సహాధ్యాయులు - ఎం ఎస్ ఆచార్య, కె ఎల్ రెడ్డి
''నువ్వు పెద్ద పత్రికలో వార్తలు రాస్తే చాల మందికి తెలిసిపోతుంది. ఏదో ఒక చిన్న పత్రికకు రాస్తే ఎవరికైనా అందుతుందా?''. అని కె ఎల్ రెడ్డి మా నాన్నతో, (సహాధ్యాయుడు ఎం ఎస్ ఆచార్యతో) పంచాయితీ చేసేవాడు. పెద్ద పత్రికలో చిన్నవాడుగా ఉండేకన్నా చిన్న పత్రికలో పెద్దవాడుగా ఉండాలని మా నాన్న అనేవాడు. పెద్ద పత్రికలు న్యాయంగా నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యమా అని కె ఎల్ తో నాన్న అనేవాడు.
పత్రికలు నడపడానికి లంచాలు అడిగే ప్రభుత్వంలో కొందరితో లాలూచీ చేసుకునేవాడే కాదు. దానిబదులు పత్రికలు నిలిపివేయడం నయం అనుకునేవాడు. ఈ తరువాత పెద్ద పత్రికలు నడిపేవారు పార్టీలతో లాలూచీ చేసే వారని కె ఎల్ కు అర్థమైపోయింది. చెన్నారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం విజృంభిచిన పోరాడాన్ని ద్రోహచర్యం అని విమర్శించాడు కె ఎల్ రెడ్డి. తరువాత పత్రికలు ప్రజలకు అనుకూలంగా కాకుండా తమ అవసరాలకు, సంపాదించే డబ్బు సంపాదకులుగా మారిపోయారు.
మలిదశ పోరాటం
ఈ తరువాత తెలంగాణ మలి దశపు పోరాటం మొదలైంది. 2001లో దినపత్రికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన తెలంగాణ పార్టీ ప్రారంభిస్తారని వార్త తెలియగానే కె. ఎల్. జర్నలిస్టులను కొందరితో మీటింగ్ కు వెళ్ళారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం నివాసగృహం పైభాగంలోనే కెసీఆర్ తెలంగాణ సమితి పార్టీ ఆఫీసు ఉండేది. కెసిఆర్ మెట్లు దిగి కిందికి వస్తుండగా కె.ఎల్. ని చూశారు. అప్పుడు మనిషి బక్కపలుచగా ఉన్నాడు. ముక్కు కార్టూన్ కు అనువైనది. ముఖం గంభీరంగా ఉంది. ఆత్మవిశ్వాసం గుండె నిండా కనిపిస్తున్నాయి.
''కేసీఆర్ నోరు తెరిచారు. పెదాలు కదలాడాయి. తెలంగాణ మాండలిక పదాలు విస్ఫులింగాల్లా బయటికి దూసుకొచ్చాయి. చెన్నారేడ్డి సహా తెలంగాణ నాయకులెవ్వరూ తెలంగాణ భాషలో, యాసలో మాట్లాడలేదు. కానీ ఇతడు స్థానిక ప్రజల భాషలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్నాడు. ఈయన ప్రసంగాలు నిస్సందేహంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటాయి. వారిని ప్రభావితం చేసి తీరుతాయి. నివురుగప్పిన తెలంగాణ నిప్పును కేసీఆర్ మళ్ళీ రాజేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా ఈ నిప్పు ఆరదనిపిస్తున్నది. నా ఈ నమ్మకం వమ్ముకాదు. బక్కోడు నిజం చేసి చూపిస్తాడు. కేసీఆర్ ప్రసంగం విన్నతర్వాత కెఎల్ రెడ్డి మదిలో మెదిలిన భావవీచికలు ఇవి,'' అంటూ చక్రధర్ 'తెలంగాణ అక్షరయోధుడు' అనే వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటే కె ఎల్ చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్ర సమితిని సమర్థించారు. కాంగ్రెస్, బిజెపి దొందు దొందే అని అనుకునే వాడు. ఈ పార్టీల కన్నా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముఖ్యుడని నమ్మాడు. వారికన్న కె తారక రామారావు కె టి ఆర్ చాలా సమర్థుడని అన్నాడు కూడా. కె సి ఆర్, కె టి ఆర్ పార్టీని సమర్థించారు.
కేసిఆర్ ప్రోత్సాహం
కె ఎల్ రెడ్డి మొత్తం తెలంగాణ జనానికి తెలియడానికి కారణం కే. చంద్రశేఖర్ రావ్. దానికి కారణం కె ఎల్ రెడ్డి గురించి జి. చక్రధర్ రాసిన ఒక వ్యాసం. ఆ వ్యాసం చదివింది ఎవరంటే మన ముఖ్యమంత్రి. చదవగానే చేసిన పని - పాత్రికేయుడు బతకడానికి ఇబ్బంది పడుతున్నాడని కె ఎల్ రెడ్డికి వెంటనే ఫోన్ చేసారు ముఖ్యమంత్రి. మరో ప్రముఖ వ్యక్తి ఎవరంటే.. ఎం వి ఆర్ శాస్త్రి. 20 సంవత్సరాలపాటు పనిచేసిన గొప్ప సంపాదకుడు, మంచి రచయిత. వార్తారచనా వీరుడు. కె ఎల్. పత్రికకు రాయగలిగినా కనీసం కావలసిన డబ్బు లేదని అడిగారు. శాస్త్రి బాధ పడ్డారు. ముందు ఆయన కష్టం గురించి రాయాలను కున్నారు. చక్రధర్ ఆ పని చేసాడు, అద్భుతంగా. దాన్ని భూమిక పేరుతో ఆంధ్రభూమి పత్రికలో శాస్త్రి ముద్రించారు.
2016 లో ఒక రోజు ఆంధ్రభూమి ఆఫీసులో కె. ఎల్. రెడ్డి నన్ను కలిశాడు. "నెలకు 15 వేలు ఉంటే హాయిగా గడిచిపోతుంది. రోజూ వచ్చి రాసి పెడతాను" అన్నాడు. అప్పటికే ఆయన 80 దాటాడు. గూని వచ్చింది. ఇంకా రాయటం నీ వల్ల కాదు. అది పరిష్కారం కూడా కాదు. నీ గురించి పత్రికలో ప్రత్యేక వ్యాసం వేద్దాం. దాన్ని చూపించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయానికి ప్రయత్నం చేద్దాం'' అన్నాను. సీనియర్ జర్నలిస్టు రెడ్డి గారికి ఆప్తుడు గోవిందరాజు చక్రధర్ గారు చక్కని వ్యాసం రాశారు. దానిని మా డైలీ ఫీచర్స్ సప్లిమెంటు "భూమిక" మొదటిపేజీలో ప్రముఖంగా వేశాము. ఎవరూ పనిగట్టుకుని పైరవీ చేయాల్సిన అవసరం లేకుండా అందరికంటే ముందు ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారు పొద్దున్నే ఆ వ్యాసం చూసి నేరుగా తానే కె.ఎల్.రెడ్డికి ఫోన్ చేసి పిలిచారు'' అని శాస్త్రిగారు వివరించారు.
కరిగిపోయిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుగారు కె ఎల్ ను పిలిపించారు. నీకు 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారన్నాడు. దానికి అమాయకుడు ఏమన్నాడో తెలుసా? 'నాకు 10 వేలొస్తే చాలు' అన్నాడు. పదిలక్షల రూపాయలు వస్తే ఒక అధికారి లెక్క చేసి నెలకు 8 వేల దాకా రావచ్చు అన్నారు. 'సరేలే చాలు. నేను ఇంకో రెండు వేలకు ఎక్కడనైనా పనిచేస్తే లే''. కె సి ఆర్ కావాలంటే 15 లక్షలరూపాయలు ఇవ్వాలని అక్కడి అధికారి ఒకరు లెక్కవేసి 12 వేలు కావాలన్నారు. వెంటనే అతనికి నెల 12 వేలు కోసం ముఖ్యమంత్రి గారు మళ్లీ 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు
కె ఎల్ ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేవాడు. సార్ అనే బదులు మిత్రులెవరినైనా ఆ 'మానవుడు' అంటూ ఉండేవాడు. తెలుగు భాషలోనే సాధ్యమైనంత వరకు మానవుడా అనే వాడు. కె ఎల్ రెడ్డి 'మానవుడు' సంతోషించేవాడని ఎం వి ఆర్ శాస్త్రి అంటేవాడు. ముఖ్యమంత్రికూడా ఎన్నో సందర్భాల్లో కె ఎల్ తనను గుర్తు చేసుకునే వాడు.
ఆ సామాన్యుడు మాన్యుడు కె ఎల్ రెడ్డి 93 సంవత్సరాలు దాటిన తరువాత వరంగల్లు దగ్గర గొర్రెకుంటలో కీర్తిశేషులు ప్రొఫెసర్ పర్మాజీ నిర్మించిన ఆశ్రమం లో నవంబర్ 3 తెల్లజామున కాలధర్మం చెందారు.
ఉన్నది ఉన్నట్టన్నడు
'ఈనాడు' దినపత్రికలో 1975 కు ముందు రాతపరీక్షలో గెలిచినాడు. రామోజీరావుతో ఇంటర్వ్యూలో ఉన్నదున్నట్టు చెప్పినాడు. అందుకే ఉద్యోగం ఇచ్చారు రామోజీరావు. ''నువ్వు తాగుతావా?'' అని ఆయన అడిగారట. ''మందు తాగ డం చాలామంది తాగుతారు. నేను తెలంగాణ రెడ్డోణ్ణి. రెడ్లందరూ తాగుతరు. నేనైనా అంతే. పండగలూపబ్బాలూ పెళ్లి, పెండ్లిండ్లూతాగువాళ్లం. కానెప్పుడూ వాంతులు చేసుకోలే'' అని ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయనకు నచ్చింది.
ఎం వి ఆర్ శాస్త్రి తన బ్లాగ్ స్పాట్ లో రాస్తూ. 'అప్పట్లో రామోజీరావు గారు రోజూ ఉదయానే పేపరు మొత్తం చదివి, తప్పులు మార్క్ చేసి, ఘాటుగా కామెంట్లు రాసి అందరికీ సర్క్యులేట్ చేయించే వారు. ప్రతి మంగళవారం ఎడిటోరియల్ హెడ్స్ తో మీటింగు పెట్టి లోటుపాట్లు నిశితంగా చర్చిస్తుండేవారు. ఎప్పుడు చివాట్లు పడతాయోనని న్యూస్ ఎడిటర్ సంతపురి రఘువీరరావు, చీఫ్ సబ్ వేమూరి సుబ్రహ్మణ్యం అంతటి ఉద్దండులు కూడా భయపడుతుండేవారు. అలాంటి చండశాసనుడైన చైర్మన్ ను పట్టుకుని "మీరసలు పేపర్ చదువుతారాండి" అని ఒక రోజు మీటింగులో అడిగినవాడు కె.ఎల్.రెడ్డి. ఆమాటకు ఫకాల్న నవ్వాడు చైర్మన్' అన్నాడు
శాస్త్రిగారు ఇంకా.. ''కె.ఎల్.రెడ్డి ఎవరినీ లెక్క చెయ్యడు. నచ్చకపోతే ఎవరిమాటా వినడు. మొహాన్నే దులిపేస్తాడు. రోజుకు 14 గంటలు గొడ్డులా పనిచేస్తూ ఎప్పుడు చూసినా ఆఫీసులోనే పని చేసేవాడు. సోమాజిగూడ ఆఫీసులోనే లైబ్రరీ మీది సింగిల్ రూములో ఉండేవాడు. ఆజన్మ బ్రహ్మచారి. నిప్పులాంటి మనిషి. నిజాయతీ పరుడు. అల్ప సంతోషి. మాడభూషి శ్రీధర్ వంటి ఎందరో జర్నలిస్టులను తీర్చి దిద్దిన గురువు. మంచి మనిషి. స్నేహశీలి. కడదాకా నాకు మంచి మిత్రుడు. ఈనాడు తరవాత ఎన్నో కొత్త పత్రికలలో పని చేశాడు. ప్రతి పత్రికనూ మొత్తం తానే రాసి ఒంటి చేత్తో నెట్టుకొచ్చేవాడు. అలా ఎన్ని పత్రికలను నిర్వహించాడో అతడికే లెక్క లేదు'' అనేవాడు.
''తెలంగాణా ఊసే ఎవరికీ, ఏ నాయకుడికీ పట్టని కాలాన 1980లలోనే "తెలంగాణ" పత్రిక పెట్టి అన్యాయాలపై ధ్వజమెత్తి తెలంగాణ క్షేమం కోసం తపించి, నిస్వార్థంగా పోరాడిన వాడు కె.ఎల్.రెడ్డి. అప్పట్లో ఫతేమైదాన్ ప్రాంగణంలో చిన్నగదిలో ఉండి అక్కడినుంచే పత్రిక నడిపేవాడు. జర్నలిస్టులు, ఎర్నలిస్టులు ఎంత మంది ఉన్నా కె.ఎల్. రెడ్డి ఒక్కడు చాలు పాత్రికేయ వృత్తి గర్వంగా చూపించుకోవటానికి. ఎక్కడ ఉన్నా ప్రతి దసరాకూ ఫోన్ చేసి పట్టుబట్టి తన దగ్గరికి పిలిపించుకునే కె.ఎల్.రెడ్డి కన్నుమూయటం నాలాగే చాలా మంది జర్నలిస్టులకు తీరని వెలితి'' అని శాస్త్రిగారు అన్నారు.
శ్రీధర్ వరంగల్లులో జర్నలిస్టుగా తీర్చిన కె ఎల్ రెడ్డి
1975 లో కె నరసింహారెడ్డి వరంగల్ ఈనాడు పత్రికా విలేకరిగా వచ్చారు. చాలా కమిట్ మెట్ కలిగిన వాడు. మేధావి, మహోత్తముడు పాములపర్తి సదాశివరావు గారంత దార్శనికుడు, నరసింహారెడ్డి. కానీ, ఆయన తరువాత వరంగల్ విలేకరిగా కె ఎల్ రెడ్డి వచ్చారు. అప్పడికీ వారికి మంచి పరిచయాలు. ఆ కాలంలో ఈనాడు పత్రికలో సమ్మె రావడంతో కె.ఎల్. హైదరాబాద్ కు వెళ్లిపోయారు. హైదరాబాద్ లో పత్రికలు ప్రచురించాలని కె ఎల్ కంకణం కట్టుకున్నవాడు. కనుక వరంగల్ కు విలేకరిగా ఈ రచయిత (శ్రీధర్ ను) 1977 లో నియమించారు.
ఈనాడు పత్రిక కె ఎల్ రెడ్డి వరంగల్ విలేకరిగా వదిలేసి హైదరాబాద్ కు వెళ్లారు. 1977కు ముందు సమ్మెను అధిక శాతం కార్మికులు పోరాడుతున్న రోజుల్లో పత్రిక ప్రచురించడానికి మనం నిలబడాలని కె ఎల్ రెడ్డి అనుకున్నారు. ఆ పత్రిక రావాల్సిందే అని కె ఎల్ కోరుకున్నారు. ధైర్యంగా న్యాయం కోసం ఆయన పోరాడుతున్నాననుకున్నారు.
కాని కొన్ని సంవత్సరాల తరువాత నిష్పాక్షిత లేదని, పక్షపాతం విపరీతంగా ఉందని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆయన కు అర్థమైంది. ఈ రోజుల్లో అటువంటి కారణంగా కె ఎల్ జనరల్ షిఫ్టు (సెంట్రల్ డెస్క్) బాధ్యుడుగా ఎడిషన్ రాత్రి ఒంటిగంటకు ఇచ్చేసిన తర్వాత రాజీనామా లేఖ రాసి మర్నాడు రామోజీరావుకు అందజేయమని అటెండర్ కు చెప్పి, లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇవ్వాళ పరిస్తితి ఏమిటి. నిష్పాక్షిగా ఏదీ లేదని, ఏ పత్రిక ఎవరి దుకాణమో, ఏది కరపత్ర మో అందరికీ తెలుసు. కె ఎల్ రెడ్డిని అన్యాయంగా నెలరోజులు జైలుకు పంపించారు. కరపత్రాలు నిలదీసే నేరగాల్లే ఇప్పుడుదేశంలో వీళ్లంతా. ఆయన మనసు చెప్పినట్టు నిలబడ్డాడు. తెల్లవారింది.
తనకు చిన్న గది చాలు, నేను కావాలనుకున్న వార్తలతో జనాన్ని కదిలిస్తాను అని నమ్మినవాడు కె ఎల్ రెడ్డి. కాని నమ్మిన వారు పత్రికలు డబ్బున్నవారికి కొమ్ముకాచే వారని తెలిసింది. అప్పడికి ఆయనకు తెల్లారింది. జీవితం ఆగిపోయింది. 93 సంవత్సరాల జీవితం సరిపోయింది. ప్రభుత్వాలు, పార్టీలు, మంత్రులు, వాళ్ల పత్రికలు, మాధ్యమద్యాల, దేశాన్ని ఎం ఎల్యే ఏ లను వోట్లను, టోకుగా అమ్మే వారు, మధ్యదళారులు, కలిసి పోయారని పాపం కె ఎల్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదు.
1986ల్లో ఒక పత్రికలో రెడ్డి వ్యాసం ప్రచురించారు. ఎవడ్రానన్ను తిట్టింది అని టంగుటూరి ప్రకాశం అన్నంత తీవ్రంగా రామోజీ గారి ఈనాడు ను విమర్శించేవాడు కె ఎల్. అంత ధైర్యం ఆయనది. దేనికి భయపడలేదు. అవసరం లేదు.. స్వార్థం లేదు. వివాహం లేదు. చిన్న మంచం. ఓ పళ్లెం. కొన్ని గిన్నెలు లేదా నాలుగైదు పాత్రలు చాలు. ఆశలు లేవు. కాళ్లు చాలు. కార్లవసరం లేదు. కొందరు మిత్రులు భోజనం ఇప్పించే చాలు. నాలుగైదు లాల్చీలు పైజామాలు చాలు. ఒక కారులో వస్తువులు సరిపోయేవు. వెంట తెచ్చుకున్నవేమంటే పత్రుల కటింగ్ లు కాక మరేదీ కాదు. పెన్నులు, కాగితాలు చాలు.
నా రచనలంటే కె ఎల్ కు ఇంతో ఇష్టం. 1977 కాలంలో నేను విలేకరిగా కొన్ని సలహాలు అడిగేవాడిని. ఓ ఉత్తరం రాసి పంపారు. 'నన్ను ఇట్ల అడగవద్దు. నీకు సొంతంగా ఇష్టం ఏం రాసుకోవంటే రాసుకో, నాకు చెప్పకసలు' అని. విలేకరిగా 2 సంవత్సరాలు పనిచేసిన తరువాత ఈనాడు నుంచి మరో ఉద్యొగం చేసేవాడిని నేను. వరంగల్ లో ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్సెప్రెస్ పత్రికలో పనిచేసారు. తరువాత ఉదయం పత్రికలో పదేళ్లు పనిచేసాను. కె ఎల్ రకరకాల పత్రికలలో నడిచే నేను కొన్ని వ్యాసాలు రాసేవాడిని. డిల్లీకి నేను సమాచార హక్కు కమీష్నర్ వచ్చినప్పుడు కలిసేవాడు. నేను గాంధీనగర్ దగ్గరలో ఉన్న ఒక చిన్న ఇంట్లో పత్రికల కటింగ్ కాగితాలతో కాలం గడిపే వారు.
బైంసా దేవదాస్ చాలా కాలం నేటి నిజం పత్రిక నడిపారు. మళ్లీ చిన్న ఇల్లు. చిన్న కప్పు చాయ్ సరిపోదు. మొత్తం పెద్ద గాసులో చాయ్ ఇవ్వాల్సిందే. ఆ తరువాత మహానగర్ అనే పత్రికలో నేను కొన్నేళ్లు నడిపేవాడిని. తెలుగు పదాలంటే ప్రేమం. సతీమణి అనే మాట ఒప్పుకునేవాడు కాదు. భార్యల్లో ఒకరు ఉంటే ఆవిడను సతీమణి అనాలి. అంతేకాని ఒకరే ఉంటే భార్య అని మాత్రమే అనాలి. సతీమణి అన కూడదనే వాడు. ఇదొక ఉదాహరణ. 20 సంవత్సరాల కన్న చాలా కాలం ఆంధ్రభూమి పత్రిక సంపాదకుడుగా పనిచేసిన ఎం వి ఆర్ శాస్త్రి, కె ఎల్ రెడ్డి తన మంచి మిత్రుడు. అటువంటి నిజాయితీని అమాయకుడు కె ఎల్ దొరకడు.
నల్లగొండజిల్లా పరసరాయిపల్లెలో 92 సంవత్సరాల కిందట పుట్టిన కంచర్ల లక్ష్మారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1955 బిఎ చదువుకున్నాడు. సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి హైదరాబాద్ రాజకీయ పత్రిక 'తెలుగుదేశం'లో వార్త రచయితగా ఉండేవారు. ఆ తరువాత 'ఈనాడు', 'ఆంధ్రపత్రిక', 'ఆంధ్రభూమి' పత్రికల్లో కూడా పని చేశారు. ఠాకూర్ హరిప్రసాద్ హైదరాబాద్ ఇంగ్లీషు పత్రిక 'ఇండియన్ హెరాల్డ్'లో పని చేశారు. వయోధిక పాత్రికేయుడు వి. హనుమంతరావు నడిపించిన వారపత్రికలోనూ, జి. రామారావు తెచ్చిన వారపత్రిక 'వారంవారం'లోనూ పని చేశారు. బైసా దేవదాసు నడిపిన 'నేటి నిజం'లోనూ, పాంచజన్య నిర్వహించిన 'మహానగర్'లో కూడా పత్రికలు రచించేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నడిపిన 'తెలంగాణప్రభ'లో కూడా చేశారు. అప్పుడు నేను ఉదయం పత్రికలో పనిచేస్తూ వారంలో అప్పుడప్పుడు లాల్ బహద్దూర్ స్టేడియం పక్కన ఫతే మైదాన్ క్లబ్ లో ఒక గదిలో చాలాకాలం కె ఎల్ రెడ్డితో ఉండేవాడు. ఆయన గురించి ఎంకెంత రాసినా సరిపోదు.
నా బాధ
అంతకుముందు ఏప్రిల్ 2022 లో నాకు మెదడుకు స్ట్రోక్ వచ్చింది. దాదాపు ఆరు వారాలు గడిచాయి. దాదాపు అన్నీ మరిచిపోయాను. అంతకు ముందు కె ఎల్ ను ఒక పెద్ద కాల్ ద్వారా వరంగల్ లో ఆశ్రయంలో ఈటెల సమ్మన్నగారు ఆయనకు అందరికీ సాయంతో చేర్పించారు. అక్కడ మంచి స్వచ్ఛమైన గాలి నీరు కలిగించే హాయిగా ఉంచారు. కె ఎల్ ఎందుకో కోప్పడేవాడు. కొన్ని నచ్చేది కాదు. ఇంకా ఏదో కావాలని అడిగేవాడు. కొన్ని రోజుల తరువాత ఉన్నట్టున్నట్టు వరంగల్ ఆశ్రమం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. నన్ను కూడా కోప్పడ్డాడు. ''నేను ఒప్పుకోను. నీకేమీ చెప్పను'' అని వెళ్లిపోయాడు. ఏం చేస్తాను? తరువాత కొన్నాళ్లకు చాలామంది పెద్దలు ఆయనకు సాయం చేసారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఆయనను కోప్పడినా సరే, సాయం చేసారు. కాని ఈమధ్య ఆరోగ్యం దెబ్బతిన్నది. తరువాత ఓరోజు నాకుఫోన్ చేసారు. నాతో మాట్లాడుతూ నన్ను నీవు అనే వాడు. ఓ రోజు అని కె ఎల్ రెడ్డి ''మీరు నాకు సాయం చేయండి. వరంగల్ ఆశ్రయంలో చేర్పంచండి'' అని కోరారు. సార్ నన్ను మీరు అనకండి అని చెప్పుకున్నాను. కాని రెడ్డిగారు మళ్లీ వేరే నిర్ణయించుకునారు. కాని ఆ తరువాత కొన్నాళ్లకు నా పరిస్థితి దెబ్బమయింది. అతి కష్టంగా ఎంతో సమస్యలైనా నేను ఈ నాలుగు అక్షరాలు చెప్పగలుగుతున్నాను. మళ్లీ ఈటల సమ్మన్నగారు ఎప్పుడైనా ఆయన్నే అడగక తప్పలేదు. అప్పడికీ నాకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా పూర్తిగా చదవలేను. రాయలేను. తెలుగు కూడా కష్టమే. ఒక్కొక్క పదాల కోసం పోరాడుతున్నాను. కల్యాణి సాయం చేస్తుంటే కొన్ని అక్షరాలు తెలుస్తున్నాయి.
ఇంకోసారి మళ్లీ రెడ్డి గారు వరంగల్ కు వెళ్లమన్నారు. తప్పకుండా అని ఆశ్రయం తీసుకు వెళ్లారు. రెండో రోజుకోసారి ఆయనతో మాట్లాడుతూ ఉండే వాడిని. నాకు మందులతో అవసరం. ఎక్కడికీ వెళ్లే స్థితి లేదు. అయినా మాట్లాడుతునే ఉండే వాడిని. నవంబర్ 2 రాత్రి ఆయన కాలం ధర్మం పొందారు. ఎవరు మాత్రం ఏ చేయగలరు?
- కె ఎల్ రెడ్డి నవంబర్ 3న కాలధర్మం చెందారు. 13 రోజు సందర్భాన, నా నివాళి
-మాడభూషి శ్రీధర్