వార్తలు చదువుతూ ఉండే సమయంలో అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఘటనలకు ఎవరు ఎప్పుడు.. ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు..! ఉక్రెయిన్ కు చెందిన న్యూస్ రీడర్ కు కూడా వార్తలు చదువుతూ ఉంటే అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆమె వార్తలు చదువుతూ ఉండగా.. ఆమె పన్ను రాలిపోయింది. కానీ ఆ సమయంలో ఆమె ఎంతో ప్రశాంతంగా చదివేసింది.
మరిచ్కా పదాల్కో ఉక్రెయిన్ న్యూస్ ఛానల్ లో వార్తలు లైవ్ లో చదువుతూ ఉండగా ఆమె పై పన్ను ఊడిపోయింది. ఆ సమయంలో ఆమె ఏ మాత్రం తత్తరపాటుకు గురవ్వకుండా ఆ పంటిని చేతిలోకి తీసేసుకుని.. వార్తలు చదవడం కొనసాగించింది. తన 20 సంవత్సరాల యాంకరింగ్ కెరీర్ లో ఇదొక ఊహించని పరిణామం అని తెలిపింది.
మరిచ్కా పదాల్కో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 10 ఏళ్ల కిందట చోటుచేసుకున్న చిన్న యాక్సిడెంట్ కారణంగా తన పన్ను విరిగిపోయిందని ఆమె తెలిపింది. తన కుమార్తె అలారంతో ఆడుకుంటూ ఉండగా అది తన ముఖం మీద తగలడం వలన తన పన్ను రాలిపోయిందని తెలిపింది. మరిచ్కా పదాల్కో ఈ విషయం ఎవరూ గుర్తించరేమో అని అనుకున్నానని.. కానీ అందరికీ తెలిసిపోయింది అని అభిప్రాయపడింది. మరిచ్కా పదాల్కో అప్లోడ్ చేసిన వీడియో 30000 మందికి పైగా వీక్షించారు. ఏ మాత్రం తత్తరపాటు లేకుండా ఆమె తన పని తాను చేసుకుని వెళ్ళిపోయినందుకు పలువురు అభినందిస్తూ ఉన్నారు.